YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

అక్రమ రుణాలు...!!

అక్రమ రుణాలు...!!

ఆదిలాబాద్ : ఎస్సీ కార్పొరేషను ద్వారా రుణాలు మంజూరులో అక్రమాలకు అడ్డుకట్ట పడటంలేదు. బ్యాంకర్లు, అధికారులు కలిసి భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. దళారులతో చేతులు కలిపి బోగస్‌ లబ్ధిదారులను సృష్టించి రూ.కోట్ల రుణాలకు ఎసరు పెట్టారు. అయినా.. దీనిపైన అధికారులెవరూ నోరు మెదపరు. విచారణ పేరుతో కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా రుణాల లబ్ధిదారుల ఎంపికలోనూ అదే తీరు కొనసాగుతోంది. పారదర్శకతకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అధికారుల తీరులో మార్పు రాకపోవడంతో మళ్లీ అదే విధమైన దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మార్చి నెలాఖరు వరకు 472 మందికి రుణాలు అందించాల్సి ఉండగా.. ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. నిరుపేద, నిరుద్యోగ, షెడ్యూల్డు కులాలవారికి ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక కింద ప్రభుత్వం భూమి కొనుగోలు పథకమే కాకుండా ..రాయితీతో బ్యాంకు రుణాలను అందిస్తుంది. 93రకాలైన యూనిట్లను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధికి ఆసరా కల్పిస్తుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 80శాతం రాయితీ సొమ్మును ప్రభుత్వం అందిస్తుండగా.. మిగిలిన 20శాతం బ్యాంకులు రుణాలను మంజూరు చేయాల్సి ఉంది. పైసా ఖర్చు లేకుండానే లబ్ధిదారులకు రుణాలు ఇస్తుండటంతో దళారుల ప్రమేయం ఎక్కువైంది. బోగస్‌ లబ్ధిదారుల పేరుతో బ్యాంకర్లు, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు కలిసి భారీగా రాయితీ సొమ్మును కాజేశారు. జిల్లాలో 80శాతం వరకు అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీటిపైన సమగ్రంగా విచారణ జరిపించి అక్రమార్కులపైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఉన్నతాధికారులు మొహమాట పడుతున్నారు. అర్హులకు రుణాలు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించే బ్యాంకర్లు ఈ రుణాల మంజూరులో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. బ్యాంకు రుణం ఇవ్వకుండానే.. ప్రభుత్వం నుంచి వచ్చిన రాయితీ సొమ్మును కొందరు బ్యాంకర్లు కాజేశారు. ఇప్పటికే పలు బ్యాంకులపైన విచారణ జరిపించగా అవినీతి బయటపడింది. 2015-16లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీగా అవినీతి జరిగింది. లక్ష్యం కంటే ఎక్కువ రుణాలు ఇచ్చినట్లు చూపించి.. రూ.కోట్లు దండుకున్నారు. ఇప్పటికీ ఆ ఏడాదిలో బ్యాంకర్లు ఇచ్చిన రుణలబ్ధిదారుల వివరాలు ఇవ్వడంలేదు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో గతంలో అక్రమాలను గుర్తించారు. ఇప్పటికీ ఆ బ్యాంకు అధికారులు గతంలో రుణాలిచ్చిన లబ్ధిదారులకు సంబంధించిన యూసీలను సమర్పిచలేదు. గతంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాల నేపథ్యంలో ఇక రుణాలు ఇవ్వొద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయినా.. ఆ ఆదేశాలను పట్టించుకోకుండానే మళ్లీ మొదలు పెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్యాంకు వారీగా విచారణ జరిపితే రూ.కోట్ల అవినీతి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సామాజిక తనిఖీకోసం ఉన్నతాధికారులకు రాశామని.. ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు చేతులెత్తేశారు. జిల్లా పాలనాధికారి కూడా ఈ విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. యూనిట్లు కొనుగోలు చేయకున్నా చేసినట్లుగా చూపుతున్నారు. అందుకు ఆదిలాబాద్‌ పట్టణంలోని కొందరు వ్యాపారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ట్రేడింగ్‌ లైసెన్సులు లేకున్నా.. వాళ్లవద్ద యూనిట్లను కొనుగోలు చేసినట్లుగా తప్పుగా చూపుతున్నారు. వాస్తవానికి ఆయా యూనిట్లను విక్రయించే అర్హత లేకున్నా.. పాతవాటి వద్ద ఫొటోలు దిగి పంపుతున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలో ఓ టెంట్‌ దుకాణం నిర్వాహకుడు అర్హత లేకున్నా.. అనేక మందికి సరఫరా చేసినట్లుగా ఆధారాలున్నాయి. ఆ దుకాణం వద్దనే లబ్ధిదారులు, బ్యాంకర్లు ఫొటోలు దిగి .. సామాన్లుకు బదులుగా డబ్బులు తీసుకెళ్లారు. ఈ రకమైన దందా భారీగా సాగుతున్నా చర్యల్లేకుండాపోయాయి. యూనిట్లు కొనుగోలు చేసినట్లు చూపుతున్న దుకాణదారులను కూడా విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.

 

Related Posts