YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మండుటెండలో...

మండుటెండలో...

వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం బెంబేలెత్తుతున్నారు. ప్రతిరోజూ 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదు అవుతుండటంతో చిన్నపనైనా వాయిదా వేసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ఉపాధిహామీ పథకంపై ఆధారపడిన కూలీల పరిస్థితి దయనీయం. పని ప్రదేశంలోనే వారికి అవసరమైన కనీస అవసరాలను కల్పించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి ఏర్పాట్లు చేసినా అవి కూలీల దరిచేరని దుస్థితి. ప్రభుత్వం జారీచేసిన టెంట్లు, గడ్డపారలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అత్యవసర వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నారా? లేదా? అని పర్యవేక్షించే అధికారి లేకపోవడంతో అవి మేటీల ఇళ్లకే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని పక్కదారిపడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం 2013-14లో గ్రూపునకు ఒకటి చొప్పున 20,933 టెంట్లు పంపిణీ చేయగా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా నమోదైన 50,940 శ్రమశక్తి సంఘాలకు నీడ కల్పించేందుకు 40,000 టెంట్లు సమకూర్చింది. వీటిని క్షేత్రస్థాయి సహాయకులకు అందించారు. గ్రామ చివర్లలో ఉపాధి పనులు జరుగుతున్న నేపథ్యంలో టెంట్లు అదనపు భారంగా భావించకుండా మోసుకెళ్లిన వ్యక్తికి అదనంగా డబ్బులు చెల్లిస్తున్నారు. గడ్డపార పదునుకు సమూహంలోని వ్యక్తులకు రోజుకు రూ.100, తాగునీటికి రోజుకు రూ.10, టెంట్‌ను తీసుకొచ్చేందుకు రోజుకు రూ.10. ప్రాథమిక చికిత్స కిట్టును తీసుకొచ్చేందుకు రూ.3 ఇస్తున్నారు. ప్రస్తుతం టెంట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు లేకపోవడంతో ఆ మొత్తం ఎవరికి ఇస్తారో వేచిచూడాలి. ఇటీవల అధిక మొత్తంలో టెంట్లు డోన్‌ 1447, ఆదోని 1400, తుగ్గలి 1363, ప్యాపిలి 1224, దేవనకొండ 1196 మండలాలకు చేరుకున్నాయి. గతంలో మేటీకి ఇచ్చిన టెంట్లు కొన్ని పాడవగా మరికొన్ని మూలనపడ్డాయి. ఇంకొన్ని సొంతానికి వాడుకుంటున్నారు. ఉపాధి హామీ పథకంలో 2,61,292 కుటుంబాలు నమోదు కాగా గత ఆర్థిక సంవత్సరంలో 126 లక్షల పనిదినాలు పూర్తిచేయగా రూ.355 కోట్లు ఖర్చుచేశారు. గత వారం 1.20 లక్షల మంది వరకు కూలీలు పనులకు వచ్చారు. పెద్ద మొత్తంలో కూలీలు వస్తున్నా వీరికి పని ప్రదేశంలో కనీస మౌలిక వసతులు కల్పన జరగడం లేదు. టెంట్లు ఉపాధి పనుల్లో వినియోగించకపోవడంతో వృథాగా ఉంటున్నాయి. ప్రతిరోజూ పనులు జరిగే ప్రాంతానికి టెంట్లుతీసుకొచ్చి కూలీలకు నీడ కల్పించాలి. వాటిని సీనియర్‌ మేటీలు బయటికి తీయకపోవడంతో కూలీలు చెట్లను ఆశ్రయిస్తున్నారు. విరామ సమయంలో నీడ కోసం ముళ్లపొదళ్లను వెతుక్కుంటున్నారు. మరికొందరు ఎండ తీవ్రతను భరించలేక ఉపాధి పనులు మానుకుంటున్నారు. పనుల తనిఖీలకు వెళ్లిన అధికారులు టెంట్ల ప్రస్తావన తీసుకురావడం లేదు. వడదెబ్బ బారినపడిన కేసులు ఏడు నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో ప్యాపిలి మండలం ఏనుగుమర్రి గ్రామానికి చెందిన పి.హరిప్రియ ఉపాధి పనులకు వెళ్లి అస్వస్థతకు గురైంది. 2017 మార్చిలో కొత్తపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన మేరమ్మ ఉపాధి పనులు చేస్తూ వడదెబ్బ బారినపడి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూ మృత్యువాత పడ్డారు. కోడుమూరు మండలంలో ఓ కూలీ ఉపాధి పనులు పూర్తిచేసుకుని ఇంటికి వచ్చాక వడదెబ్బతో కూప్పకూలారు. ఇలాంటి ఘటనలు చాలనే నమోదు అవుతుండటంతో ఉపాధి కూలీలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం టెంట్లు పంపిణీ చేస్తోంది. పనులు చేపట్టిన కూలీలకు ఏరోజు ఎంత వేతనం అందుతుందనే వివరాలు తెలుసుకొనేలా ప్రతి వేతనదారునికి పేస్లిప్పులు తప్పనిసరిగా అందించాలి. అయితే వీటిని ఎక్కడా అందించడంలేదు. కూలీలకు తాము చేసిన పనికి ఎంతమేర వేతనం అందుతుందనే విషయం తెలియడంలేదు.

Related Posts