YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిర్లక్ష్యం నిండుగా..

నిర్లక్ష్యం నిండుగా..

అనంతపురం : హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలోని మడకశిర బ్రాంచ్ కెనాల్ పనుల్లో అవినీతి జరుగుతోంది. ప్రాడెక్ట్ రెండో దశలోని ప్రధాన కాల్వలో 320 కి.మీ. వద్ద మడకశిర బ్రాంచ్ కెనాల్ మొదలవుతుంది. ఇది మొత్తం 172 కి.మీ. మేర ఉంది. ఇందులో 17 ఎత్తిపోతల పథకాలు, మధ్యలో గొల్లపల్లి జలాశయం ఉంది. ఈ కాల్వలోని 3 ఎత్తిపోతల తర్వాత 8.65 కి.మీ. వద్ద గొల్లపల్లి జలాశయం ఉండగా, ఈ జలాశయానికి 2016 డిసెంబరులోనే కృష్ణా జలాలు తీసుకొచ్చారు. ఆ తర్వాత నాలుగో ఎత్తిపోతల పథకం దాదాపు జరిగినప్పటికీ 5 నుంచి 9వ ఎత్తిపోతల పథకం వరకు పనులు పూర్తిస్థాయిలో కాలేదు. అలాగే 20 కి.మీ. నుంచి 60 కి.మీ. వరకు 54వ ప్యాకేజీ, 60 నుంచి 107 కి.మీ. వరకు 55వ ప్యాకేజీ, 118 నుంచి 143 కి.మీ. వరకు 56వ ప్యాకేజీ, 145 నుంచి 172వ కి.మీ వరకు 57వ ప్యాకేజీ కింద గతంలో పనులు కేటాయించారు. చివర్లో 32 కి.మీ. అగళి కాల్వ, 26 కి.మీ. మేర అమరాపురం కాల్వ కలిపి 58వ ప్యాకేజీగా పనులు జరుగుతున్నాయి. ఈ మడకశిర కాలువ కింద ప్రధానంగా 264 చెరువులకు నీర్వివడం ద్వారా 56 వేల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీటిని అందించాలనేది లక్ష్యం. అయితే కాంట్రాక్టర్లు మాత్రం సకాలంలో పనులు చేయలేకపోయారు. పదేళ్ల కిందట మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. 2009-10 వరకు పనులు చేసిన కాంట్రాక్టర్లు తర్వాత వదిలేశారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 54, 55, 56, 57 ప్యాకేజీల్లో పనులు చేయలేకపోయిన కాంట్రాక్టర్లను గుత్తేదారులను తొలగించింది. వీటిలో 56 మినహా మిగిలిన ప్యాకేజీలకు రెండేళ్ల కిందటే పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనాలు రూపొందించి టెండర్లు పిలిచింది. దాదాపు ఈ పనులన్నీ ఆరు నెలల్లో పూర్తికావాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్లు మాత్రం ఆరు నెలల్లో పనులు చేయకుండా, గడువుల మీద గడువులు పెంచుకుంటూ వచ్చారు. ఆయా ప్యాకేజీల్లో అదనంగా ఆరేసి నెలలు చొప్పున ఇప్పటి వరకు నాలుగుసార్లు గడువులు పొడిగించుకున్నారు. అయినా సరే పనులు సకాలంలో పూర్తికాలేదు. ముఖ్యంగా 54వ ప్యాకేజీలో పనులు ఎంతో నెమ్మదిగా సాగుతున్నాయి. గతంలో ఈ ప్యాకేజీని ఆర్‌ఎంఎన్‌-జీవీఆర్‌ దక్కించుకున్నాయి. ఇందులో ప్రధానంగా ఆర్‌ఎంఎన్‌ సంస్థ పనులు చేపట్టగా, వాటిని సకాలంలో చేయకపోవడంతో రెండేళ్ల కిందట తప్పించారు. మిగిలిన పనులకు కొత్త ధరలతో అంచనాలు రూపొందించి టెండర్లు పిలవగా పీఎల్‌ఆర్‌ సంస్థ పనులు దక్కించుకుంది. ఈ సంస్థ 2016, జనవరిలో ఒప్పందం చేసుకోగా, ఆరు నెలల్లో పనులు చేయాల్సి ఉంది. అయితే ఆ తర్వాత మరో ఆరేసి నెలలు చొప్పన ఇప్పటికే నాలుగుసార్లు గడువు పొడిగించినా పనులు కాలేదు. మరోవైపు ఈ ప్యాకేజీలో గతంలో పనులు చేసిన ఆర్‌ఎంఎన్‌ సంస్థ.. కొన్ని పెండింగ్‌ పనులు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నట్లు తెలిసింది. ఇంజినీర్లు ఎంత వెంటపడినా సరే పనులు చేసే పరిస్థితి కనిపించలేదు. మరోవైపు లేపాక్షికి ఎలాగైనా నీటిని తీసుకెళ్లాల్సి ఉన్నా.. కాంట్రాక్టర్ మాత్రం పనుల్లో వేగం చూపలేదు. దీంతో ఒకానొక దశలో ఇంజినీర్లు, కాంట్రాక్టర్ పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇంతలో నిర్దేశిత గడువులోపు లేపాక్షికి నీరు అందలేదని ఈఈని సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. అయితే పనులు చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై హంద్రీ-నీవా ఉన్నతాధికారులుగానీ, ప్రభుత్వంగానీ చర్యలు తీసుకోకపోవడంపై ఇంజినీర్లు మండిపడుతున్నారు. ఇతర ప్యాకేజీల్లో కూడా పనుల విషయంలో నిర్లక్ష్యం చూపిస్తున్న కాంట్రాక్ట్ సంస్థలపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు గతంలో ఈపీసీ కింద చేపట్టారు. రెండేళ్ల కిందట ఆ కాంట్రాక్టర్ ను తప్పించి కొత్త కాంట్రాక్టర్ కి పనులు అప్పగించిన తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా 54వ ప్యాకేజీలో అదనంగా 28 స్ట్రక్చర్లు అవసరమని గుర్తించారు. కొన్నిచోట్ల వాగులు ఈ కాల్వలోకి రాకుండా, కాల్వపై నుంచిగానీ, కింద నుంచిగానీ వెళ్లేలా నిర్మాణాలు చేయడం, రహదారులు ఉన్నచోట్ల సింగిల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉందని గుర్తించారు. వీటికి రూ.12 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇంజినీర్లు వీటిపై నిర్ణయం తీసుకోవడంలో కూడా తీవ్ర జాప్యం చేశారు. ఎట్టకేలకు గత ఏడాది ఆరంభంలో ఈ కొత్త నిర్మాణాల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రతిపాదనలతో దస్త్రాన్ని ఈఎన్‌సీకి పంపారు. ఏడాది అవుతున్నాసరే ఇప్పటి వరకు మోక్షం కలగలేదు. మరోవైపు ప్రస్తుత కాంట్రాక్టర్ ఈ కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. తనకు అధికారికంగా అనుమతిస్తూ పత్రాలిస్తే పనులు చేస్తానని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. దీంతో ఇక్కడి ఇంజినీర్లకు కూడా దిక్కుతోచడం లేదు.

 

Related Posts