YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బలమైన నేతల బందీలుగా ఇంచార్జీ మంత్రులకు...

బలమైన నేతల బందీలుగా ఇంచార్జీ మంత్రులకు...

బలమైన నేతల బందీలుగా ఇంచార్జీ మంత్రులకు...

విజయవాడ, జూన్ 11
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. రాజ‌కీయాలు మాత్రం హీటెక్కాయి. మంత్రి బొత్స చెప్పిన‌ట్టు కొంద‌రు నేత‌ల‌కు అసంతృప్తి అధికారుల‌పై ఉండి ఉంటే.. ప‌రిస్థితి.. వ్యాఖ్యలు.. వేరేగా ఉండేవి. కానీ, నిజం అదికాదు.. అసలు అసంతృప్తికి కార‌ణం వేరే ఉంది. దానిపైనే స‌ద‌రు ఎమ్మెల్యేల పోరాటం.. ఆ రాటం అంతా కూడా! కానీ, అస‌లు విష‌యానికి మ‌సిపూసి.. లేనిది సృష్టించేందుకు బొత్స ప్రయ‌త్నిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. జిల్లాల్లో రాజ‌కీయాల‌ను చ‌క్కదిద్దేందుకు, అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు జ‌గ‌న్ పాల‌న ప్రారంభించిన రెండు నెల‌ల్లోనే ఇంచార్జ్ మంత్రుల‌ను నియ‌మించారు. వీరికి జిల్లాల‌ను అప్పగించారు. అది కూడా అత్యంత పార‌ద‌ర్శకంగా ఉండేలా మంత్రుల‌ను నియ‌మించారు. స‌ద‌రు జిల్లాతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నవారిని.. నిజాయితీప‌రుల‌ను ఏరి కోరి మ‌రీ జ‌గ‌న్ స‌ద‌రు జిల్లాల‌కు పంపించారు.ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. త‌ర్వాత త‌ర్వాత‌.. ఇన్‌చార్జ్ మంత్రులు.. స్థానికంగా బ‌ల‌మైన నాయ‌కులు, ఎమ్మెల్యేల వ‌ల‌ల‌కు చిక్కుకుపోయారు. జిల్లాకు ఏదైనా స‌మీక్షకు వెళ్తే.. స‌ద‌రు నేత‌లు చేసే గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లొంగిపోతున్నార‌నే వాద‌న కొన్నాళ్లుగా వైసీపీలో బ‌హిరంగంగా వినిపించింది. ప‌లితంగా ఇలా మ‌ర్యాద‌లు చేసిన రామ‌న్నలు.. ఇంచార్జ్ మంత్రుల‌ను త‌మ చేతుల్లోకి తీసుకున్నారు. వారు చెప్పిందే వేదం.. వారు చూపిందే మార్గం అనేలా ఇంచార్జ్ మంత్రుల‌ను మెస్మరైజ్ చేసేశారు. దీంతో నిజంగా జిల్లాల్లో ఉన్న స‌మ‌స్యల‌పై దృష్టి పెట్టే ఓపిక‌, ఓర్పు ఇంచార్జ్ మంత్రుల‌కు లేకుండా పోయింది.ఈ నేప‌థ్యంలోనే త‌మ‌కు గిట్టని వారిని దూరం పెట్టడం, త‌మ‌కు న‌చ్చిన వారిని మ‌చ్చిక చేయ‌డం కామ‌న్ అయిపోయింది. ఈ ప‌రిణామాలు అధికారుల‌పైనా ప‌డ్డాయి. ఇంచార్జ్ మంత్రి నుంచి ఫోన్ వ‌స్తే.. ఒక‌విధంగా స్పందించ‌డం .. లేకుంటే మ‌రో విధంగా ప‌ని చేయ‌డం ష‌రా మామూలే అన్న విధంగా మారిపోయింది. దీంతో క్షేత్రస్థాయిలో వ్యవ‌స్థ గాడిత‌ప్పిపోయింది. ఇప్పుడు ఇంత జ‌రుగుతున్నా.. ఒక్క ఇంచార్జ్ మంత్రి కూడా వీటిపై స్పందించ‌లేదు. ఏ ఒక్కరూ నోరు విప్పి మాట్లాడ‌లేదు.ఒక‌రిద్దరు ఇన్‌చార్జ్ మంత్రులు స్ట్రిక్ట్‌గా ఉంటున్నా వారి మాట‌ల‌ను ఎమ్మెల్యేలు లెక్కచేయ‌డం లేద‌ట‌. మ‌రి కొన్ని చోట్ల ఎంపీలు వ‌ర్సెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వ‌ర్సెస్ ఎమ్మెల్యేలు గొడ‌వ‌లు ప‌డి ఇన్‌చార్జ్ మంత్రుల‌కు చెపుతున్నారు. దీంతో ఇన్‌చార్జ్ మంత్రులు ఎవ‌రికి కొమ్ముకాస్తే ఎవ‌రికి కోపం వ‌స్తుందో ? అని మిన్నకుండిపోతున్నారు. పైగా వీటిని అధిష్టానంకు చెప్పడం లేదు. చెప్పేందుకు అధిష్టానం టైం కూడా ఇవ్వని ప‌రిస్థితి ఉంది. మ‌రి కొన్ని చోట్ల ఇన్‌చార్జ్ మంత్రుల మాట‌లు కూడా ఎమ్మెల్యేలు విన‌ని ప‌రిస్థితి ఉంది. యేడాదికే ఇలా అయితే, వ‌చ్చే నాలుగేళ్ల ప‌రిస్థితి ఏంటి? అనేది కీల‌క ప్రశ్నగా మారింది.

 

Related Posts