ఆర్ధిక మాంద్యాలను మించి...మాంద్యం
న్యూఢిల్లీ, జూన్ 11,
దాదాపు 150 సంవత్సరాల చరిత్రలో కనీవినీ ఎరుగని ఆర్థిక మాంద్యం ప్రపంచంపై ఆవరిస్తోందని, దీనివల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలే కుప్పగూలే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు తీవ్ర హెచ్చరిక చేసింది. కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో నెలకొన్న సంక్షోభంతో ఆర్థికమాంద్యం ఏర్పడిందని, 1870 తర్వాత వచ్చిన అత్యంత దారుణమైన మాంద్యం ఇదేనని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్ తెలిపారు. 1870 నుండి 14 ఆర్థిక మాంద్యాలను ప్రపంచం ఎదుర్కొందని, ఈ అన్నింటిలో ప్రస్తుతం కరోనా ఆధారిత మాంద్యం అగ్రస్థానం దక్కించుకుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. లాక్ డౌన్, ఆర్థిక కార్యకలాపాల ప్రతిష్టంభన కారణంగా తీవ్రమైన ఆర్థిక మాంద్య పరిస్థితి ఏర్పడనుందని చెప్పింది. దీంతో ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 5.2 శాతం తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అంతేకాదు కరోనా అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక కష్టాలు దారుణంగా ఉంటాయని తెలిపింది. తలసరి ఆదాయం ఈ ఏడాది 3.6 శాతం మేర తగ్గవచ్చునని, ఇది లక్షలాదిమంది పేదలను కడు పేదరికంలోకి నెట్టివేస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆర్థిక ప్రభావంతో పాటు అంతకుమించిన తీవ్రమైన, దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక ప్రభావాలుంటాయని తెలిపింది. తద్వారా ఇది దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించారు. కరోనా మహమ్మారి అత్యంత తీవ్రంగా ఉన్న దేశాలలో, ప్రపంచ వాణిజ్యం, పర్యాటక రంగం, వస్తువుల ఎగుమతులు , విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడే దేశాలలో ఈ దెబ్బ తీవ్రంగా ఉంటుందని దీంతో వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి మైనస్ 2.5 శాతంగా ఉండవచ్చునన్నారు.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత గత 60 ఏళ్లలో ఇంతటి ప్రభావం ఇదే తొలిసారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని మాల్పాస్ పిలుపునిచ్చారు. అప్పుడే ఆర్థిక పునరుత్తేజం సాధ్యమన్నారు. ఈ మాంద్యంలో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల వాటా 90 శాతానికి పైగా ఉంటుందని, ఇది 1930-32 మహా మాంద్యం సమయం నాటి 85 శాతం కంటే ఎక్కువన్నారు.రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి దారుణ పరిస్థితులు ఇప్పుడు కనిపించవచ్చునని పేర్కొంది. 1870 నుండి 14 ఆర్థిక మాంద్యాలను ప్రపంచం ఎదుర్కొందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. 1870, 1876, 1885, 1893, 1908, 1914, 1917 -1921, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009, 2020 లలో ప్రపంచంలో ఆర్థికమాంద్యం వచ్చిందని తెలిపింది.కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం తప్పదన్నఆందోళనల నేపథ్యంలో ఇప్పటివరకూ ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన అమెరికాకు సంబంధించి అధికారిక షాకింగ్ రిపోర్టు వెలువడింది. కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ ఫలితంగా గత ఫిబ్రవరిలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ అధికారికంగా మాంద్యంలోకి ప్రవేశించిందని ఆర్థిక నిపుణుల తాజా పరిశోధనలో వెల్లడైంది. బిజినెస్ సైకిల్ డేటింగ్ కమిటీ నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రకటించిన దాని ప్రకారం మహమ్మారి దేశాన్ని తుడిచి పెట్టేసింది. తద్వారా అధికారికంగా 128 నెలల ఆర్థిక వృద్ధికి ముగింపు పలికి మాంద్యం లోకి ప్రవేశించింది. అమెరికా మహమ్మారి కారణంగా ఉపాధి కల్పన, ఉత్పత్తి క్షీణతలో అసాధారణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా మందగించడంతో ఊహించిన దానికంటే వేగంగా మాంద్యంలోకి జారుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రెండుసార్లు ఏర్పడిన మాంద్యం ఆరు నుండి 18 నెలల వరకు కొనసాగింది. 1929 లో ప్రారంభమైన మహా మాంద్యం 43నెలల పాటు కొనసాగింది. అయితే గత మాంద్యాల మాదిరిగానే ఇపుడు కూడా శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంటుందా లేదా అనేది నిర్ణయించేందుకు రికవరీ వేగం ముఖ్యమైందని వ్యాఖ్యానించారు. ఉదాహరణకు 2007- 2009 కాలంలో అనేక లక్షల బ్లూ కాలర్ ఉద్యోగాలు శాశ్వతంగా కోల్పోవడం, దీర్ఘకాలిక నిరుద్యోగం, మధ్య, తక్కువ-ఆదాయ కుటుంబాల బలహీనమైన వేతన వృద్ధి లాంటి అంశాలను గుర్తు చేసిన పరిశోధన ఆర్థిక వృద్ది పురోగమనం వీటిపై ఆధారపడి వుంటుందని తేల్చి చెప్పింది. మరోవైపు రెండవ ప్రపంచ యుద్ధం 1946 తర్వాత అమెరికా జీడీపీ ఏకంగా దారుణంగా పతనమైంది. అమెరికా స్థూల జాతీయోత్పత్తి ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 4.8 శాతం పడిపోయింది. ప్రస్తుత త్రైమాసికంలో చారిత్రాత్మక కనిష్టానికి పడిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తుండగా, ఈ త్రైమాసికంలో దాదాపు 54 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. నిరుద్యోగిత రేటు ఫిబ్రవరిలో రికార్డు కనిష్టం 3.5 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో 14.7 శాతానికి, మే నెలలో 13.3 శాతానికి చేరింది. కాగా కనబడని శత్రువు కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పకపోవచ్చునని దేశ ఆధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా లాక్‌డౌన్ కారణంగా దుకాణాల మూత, పరిమిత సేవల ఆంక్షల నేపథ్యంలో రీటైల్ పరిశ్రమ కుదేలైంది. దీంతో ఈ ఏడాదిలో సుమారు 25 వేల దుకాణాలు శాశ్వతంగా మూత పడనున్నాయని ఒక నివేదిక వెల్లడించింది. దేశంలోని మాల్స్, డిపార్టమెంటల్ స్టోర్లపై వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపనుందని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న మాల్ ఆధారిత చిల్లర వ్యాపారులు మరింత కుదేలవుతారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో పరిస్థితి 2019 నాటికంటే దారుణంగా వుంటుందని పేర్కొంది. 2019లో 9,800కి పైగా దుకాణాలను మూసివేసిన రికార్డును బద్దలు కొట్టేంత తీవ్రంగా ఇది ఉంటుందని నివేదించింది. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా మార్చి మధ్యలో అమెరికన్ రిటైలర్లు నష్టాల పాలయ్యారు. పలు షాపులు మూత పడ్డాయి. ప్రస్తుతం కొన్ని పరిమితులతో షాపులు తిరిగి తెరుచుకున్నప్పటికీ , లాక్‌డౌన్ ప్రతిష్టంభనతో చిల్లర వ్యాపారులు జూన్ 5 నాటికి సుమారు 4 వేల దుకాణాలను శాశ్వతంగా మూసివేతకు నిర్ణయించడం గమనార్హం. వందల సంఖ్యలో దుకాణాలను మూసివేసిన వరుసలో జె.సి. పెన్నీ, విక్టోరియా సీక్రెట్ , పీర్1 ఇంపోర్ట్స్ సంస్థలు ఉన్నాయి. లాక్ డౌన్ ప్రభావం స్పష్టంగా తెలియకముందే, 2020 లో 15,000 దుకాణాలు మూతపడతాయని కోర్ సైట్ మార్చిలో అంచనా వేసింది.