వేగంగా ఆపరేషన్ కశ్మీర్
శ్రీనగర్, జూన్ 11,
జమ్మూ కశ్మీర్‌లో మూడు రోజుల వ్యవధిలోనే 14 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. షోపియాన్ జిల్లాల్లో మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో మొత్తం 14 మంది భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. బుధవారం తెల్లవారుజామున షోపియాన్ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు వెల్లడించారు. షోపియాన్ జిల్లా సుగూ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. సుగూ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న సైన్యం అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టింది.ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. కాగా, 18 రోజుల్లోనే 10 ఆపరేషన్లు నిర్వహించి, 26 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టికరిపించింది. వీరిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు 10 వరకు ఉన్నారు. రంజాన్ నెల, ఈద్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున తీవ్రవాదుల ఏరివేత చర్యలను సైన్యం ప్రారంభించింది.ఉగ్రవాద సంస్థల అగ్రనేతలే టార్గెట్‌గా రంగంలోకి దిగిన సైన్యం.. విజయం సాధించింది. సైన్యంవైపు ఎలాంటి నష్టం జరగకుండా తెలివిగా ముష్కరులను మట్టుబెట్టింది. ఐఎస్ (జమ్మూ కశ్మీర్ విభాగం) కమాండర్ అదిల్ అహ్మద్ వంద్, లష్కరే తొయిబాకి చెందిన షహీన్ అహ్మద్ థోకేర్‌లు మే 25న హజీపొరా ఎన్‌కౌంటర్‌లో, మే 30న కుల్గామ్ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాయిద్దీన్ కమాండర్ పర్వేజ్ అహ్మద్ పండిత్, జైషే మొహమద్ కమాండర్ షకీర్ అహ్మద్ ఇటూ హతమయ్యారు.జూన్ 2న అవంతిపొరలోని త్రాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మొహమద్‌కు చెందిన అఖీబ్ రంజాన్ వనీ, మహ్మద్ మక్బూల్ చోపన్‌లను మట్టుబెట్టారు. జూన్ 3న పుల్వామాలోని కంగన్‌లో జైషే టాప్ కమాండర్, పాక్ ఉగ్రవాది ఫౌజీ భాయ్, జావేద్ అహ్మద్, హిజ్బుల్ కమాండర్ మంజూన్ అహ్మద్ కర్.. జూన్ 7న జైషే టాప్ కమాండర్ ఒవైసీ అహ్మద్ మాలిక్, హిజ్బుల్ కమాండర్ అదిల్ అహ్మద్ మిర్, బిలాల్ అహ్మద్ భట్, సాజిద్ అహ్మద్, ఉమేర్ మోహియుద్దీన్ దోభీ, రయీస్ అహ్మద్ ఖాన్‌లను షోపియాన్‌లో రెబాన్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఈ 18 మంది ఉగ్రవాదులతో పాటు మే 28 రాజౌరిలో నలుగురు ఉగ్రవాదులను సైన్యం కాల్చిచంపింది.