YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

 ముందుకు సాగని 108

 ముందుకు సాగని 108

 ముందుకు సాగని 108
ఖమ్మం, జూన్ 11,
108 వాహనాల సేవలు నిలిచిపోయాయి. బంక్‌ యజమానులకు రూ.లక్షల్లో బకాయిలు ఉండడంతో వారు 108 వాహనాలకు డీజిల్‌ పోయడం నిలిపివేశారు. దీంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలో 14 వాహనాలు అత్యవసర సేవలు అందిస్తుండగా.. అందులో 11 వాహనాలు పూర్తిగా షెడ్లకే పరిమితమయ్యాయి. కొన్ని నెలలుగా పేరుకుపోయిన బకాయిలకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలోని మధిర, సత్తుపల్లి, కల్లూరు వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని బంక్‌ యజమానులకు నచ్చజెప్పి అక్కడి వాహనాలను పైటెట్లు నెట్టుకొస్తున్నారు. వారంలోపు వాటి బకాయిలు చెల్లించని పక్షంలో అవి కూడా షెడ్లకే పరిమితమవుతాయని అక్కడి వాహనాల పైలెట్లు చెబుతున్నారు. 108 వాహనాలకు సంబంధించి అధికారులు బంక్‌ యజమానులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. మధిర, సత్తుపల్లి, కల్లూరు, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన వాహనాలకు ఆయా ప్రాంతాల్లో బంక్‌ యజమానులతో ఒప్పందం ఉంటుంది. ప్రతి నెల వాహనాల్లో పోయించిన డీజిల్‌కు అయ్యే ఖర్చు బంక్‌ యజమానులకు చెల్లిస్తుంటారు. అయితే జిల్లాలోని 14 వాహనాలకు సంబంధించి మూడు, నాలుగు నెలలుగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.12లక్షల బకాయిలు బంక్‌ యజమానులకు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో బంక్‌ యజమానులు క్రమక్రమంగా డీజిల్‌ పోయడం నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం మూడు వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. రేపో మాపో అవి కూడా మూలనపడనున్నాయి. 108 వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేకపోవడంతో అత్యవసర సేవలు నిలిచిపోనున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులు, ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాలకు గురైన వారు 108 వాహనాలు లేక మార్గమధ్యలోనే ప్రాణాలు వదలాల్సిన దుస్థితి ఏర్పడింది.రాష్ట్ర ప్రభుత్వం టూ వీలర్‌ ద్వారా 108 సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అందుకుగాను జిల్లాకు రెండు 108 మొబైల్‌ వాహనాలను సమకూర్చింది. అయితే అవి జిల్లాకు చేరి నెలలు గడుస్తున్నా ఇంతవరకు సేవలు ప్రారంభించలేదు. 108 వాహనం కంటే అతి త్వరగా మారుమూల ప్రాంతాలకు అత్యవసర సేవలు అందించేందుకు మొబైల్‌ 108 సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని అందుబాటులోకి తెస్తే కొంతమేర సేవలు విస్తృతమవుతాయి. ఒకపక్క ఉన్న వాహనాలు మూలనపడి ఉండగా.. వచ్చిన వాహనాలను వినియోగంలోకి తేకపోవడంతో అత్యవసర సేవలు జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా బకాయిలు చెల్లించి.. 108 వాహనాలతోపాటు ఉన్న మొబైల్‌ వాహనాలు వినియోగంలోకి తెచ్చి.. ప్రమాదంలో ఉన్న వారిని రక్షించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Related Posts