దైవ అనుభూతి
సత్యాన్వేషణ బయటలేదు. అది నీతో నీలోనే తెలియబడాలి. సత్యాణ్వేషణ నిమిత్తం అరణ్యములు తిరగటం, కొండగుహలలో పడియుండటం అవసరంలేదు. ప్రతిదినము వీలున్నంత సమయంలో ఆత్మ విచారణ సలుపవలయును. ఇక కర్మ క్షేత్రంలో ఏ ఆటంకములు, విఘ్నములు ఏమి చేయలేవు. క్రమంగ సర్వత్ర ఆత్మానుభూతి సిద్ధిస్తుంది. ఈ దశలో అంతయు యోగశక్తిగ మీ పనులు సాగిపో గలవు. అడవులపాలై తిరిగినంత మాత్రమున లాభంలేదు. మిధ్యా నేనును, సైతాన్ భ్రాంతిని వదలాలి. ఇది అసలైన సన్యాసం, పరివ్రాజక స్ధితి. ముందుగ నిన్ను నీవు సన్యసించుకో. నిన్ను విసర్జించిన అసలైన నేను శేషిస్తుంది. ఆ నేనే సర్వలోకములకు వెలుగు. ఇదియే విశ్వగర్భ దైవ నేను. సంకుచిత, పరిమిత నేను అంతర్ధానమైనపుడు ఆత్మ కేంద్రంలో నిజమైన సత్య దైవ నేను వెలుగును. అరణ్య మధ్యంలో యున్నను కల్లోలిగ మనసుకు శాంతిలేదు. ఎటు వ్యవహరించినా శిరస్సును ప్రశాంతంగ ఉంచినచోట ఏకాంతం మానసికా వస్ధ. సర్వకాలాలకు చెందిన సత్యాత్మ స్వరూప స్వభావమే నిజముక్తి. ఇది ఫలానా వారికనే నిబంధనలేదు. మనో పరిపక్వత ననుసరించి ఎవ్వరైనను పొందవీలున్నది. ప్రతివారి చరమ లక్ష్యం ఇది. మోక్షానికి అడ్డు నిలిచే మిధ్యా నేనును తొలగించాలి. మానసిక అభ్యంతరాలు రహితం కావాలి. పరిస్దితుల మార్పుకన్న మనో మార్పు ముఖ్యం. ఈ మారు మనసే ఆత్మదర్శనకారి. ఏ వ్యక్తిగాని బహిర్గతమైన ప్రవర్తనవల్ల హక్కులను పొందలేడు. అతనెంతవరకు సత్యస్వరూపుడో అంతవరకే అతని హక్కులు పరిమితమై యుండును. అతని సత్యానికి కొలబద్ద అతని చైతన్యమే. ఈ చైతన్య స్వాతంత్ర్యము పొందడానికి ప్రతివ్యక్తి తన క్షుధ్ర అహమును విసర్జించాలి. గీతాసారమంతయు ఇందులోనే గలదు. భారతీయులు భావించి, భాషించే అనంతం అనేది లోన సరకులేని శూన్యం కాదు. అనంతుని ఈ జీవితంలో తెలుసుకోవటమే ముక్తి. అన్నిట, అంతట ఆ విశ్వ విధాత స్వరూప స్వభావమును గుర్తించటమే నిజమైన దృష్టి. శైశవదశ లోని పిల్లలకు నడక నేర్పునట్లు యాత్రలన్నియును సదుద్దేశ్యముతో ఏర్పరుచ బడినవే. ఐనను అవియే సర్వస్వములు కావు. యాత్రలతో ఆగిపోరాదు. భూలొక యాత్రలన్నియును కర్మకాండలోనివే. ఆపై ఉపాసన, జ్ఞాన కాండలు గలవు. త్రికాండముల మీరినపుడే పరిపూర్ణ సిద్ధి. అంతొ ఇంతో గొప్పతనము, మహిమ, ప్రభావం లేనిదే లక్షలమంది యాత్రలు చేయటం ఎందుకని అనేవారుంటారు. అది నిజమేగాని “యద్భావం తద్భవతి” యన్నట్లు ఎవరి భావన ఎట్లుండునో బయట అలాగే కనిపిస్తుంది. అలాగే జరుగుతుంది. యాత్రలు చేయువారు దైవ భావనతో వెళ్ళెదరు. అదే ప్రభావం చూపుతుంది. ఆందరి వ్యక్తుల దైవభావం ఎక్కడ కేంద్రీకరించబడునో అక్కడ అమోఘ ప్రభావం గోచరించును. యాత్రలన్నియును ఒకింత ఆధ్యాత్మిక మార్గ సాధనలేగాని, జన్మ రాహిత్య సిద్ధి తన్ను తా తెలియక ఏ యాత్రలలో లేదు. అలాగని యాత్రలు నిరర్ధక ములు, చేయరాదని కాదు. అవి ప్రాధమిక దర్జాలని తెలియాలి. ఆ అంగడి గోలలు తగ్గించి మౌన ప్రకాశమును దర్శించవలయును. ఈ భూలోకంలోని సర్వమత సంబంధ క్షేత్రములు, యాత్రలన్నియును ‘నేను’ యనెటి కేవలఖండ ‘దైవ నేను’ ఉనికిలోనివేనని తెలియాలి. మీరు చేయు యాత్రలు మీలో పరివర్తన తేవాలి. దుష్ట తలంపులను విసర్జించి దివ్య భావ శక్తి ప్రేరణతో ఇల్లు చేరాలి. అంతేగాని తల నీలాలు ఇచ్చి రాగానే సరిపోదు. చివరకు సంచారముల బందుచేసి నిలుకడపొంది, తానున్న చోటనే ఆత్మ తత్త్వం దర్శించాలి. ఆత్మనిష్ఠ చిక్కిన వానికి వేరే యాత్రలతో పనిలేదు. అన్ని యాత్రలు వారిలోనే దర్శించ గలరు. దైవ భావంతో గాంచినపుడు విగ్రహముగాని, మరెట్టి ప్రతిమగాని పరమాత్మ స్వరూపంగ భాసిల్లుతుంది. దేవుని రాతిగ మార్చుటకన్న, రాతిని దేవునిగ చేయుట మిన్న. ఇదియే భారతీయుల విగ్రహారాధనలోని అమోఘ రహస్యము. ద్రోణాచార్యుని విగ్రహమును సజీవమూర్తియైన ఆచార్యునిగ నిలుపుకొని ఏకలవ్యుడు విలువిద్యలో అర్జునుని మించిపోయాడు. ఇదియే ఆత్మ విశ్వాసములోని బలము. వరములనిచ్చే విశ్వేశ్వరుడు బయటలేడు. మానవుని హృదయాంతరంగమున గలడు. అందులకే హృదయశుద్ధిగలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరనెటి క్రీస్తువాణి సత్యము. విద్యార్ధులందరు పాఠశాలలో ఎవరి మేధాశక్తి ననుసరించి వారు చదివినా చివరకు ఐ.ఏ.ఎస్,, ఐ.పి.ఎస్., కోర్సులలో చేరుటకు ప్రతిభయే ప్రధానం కావున చాలామంది తప్పిపోయి ప్రవేశ పరీక్షలోనే ఆగిపోగలరు. అతి మేధా సంపన్నులే పై చదువులకు ఎంపిక కాబడునట్లు యాత్రలెన్ని చేసినను, అతిమానస భూమిక నధిరోహించి మోక్ష సిద్ధికి అర్హులైనవారి సంఖ్య స్వల్పాతి స్వల్పమని విజ్ఞులు గ్రహించాలి. ఊరికే ఉండకుండ అనుభవసిద్ధికై, నేత్రానంద పరవశమునకై యాత్రలు చేయాలి. అందువల్ల దోషంలేదుగాని అంతటితో మా బాధ్యత తీరిందని భ్రమపడరాదు. నిజంగా ఆలోచిస్తే నిన్ను మించిన యాత్రలేదు. అట్టి నీవనగ ఎవరో ఉన్నది ఉన్నట్లుగ తెలుసుకో. సమస్త భగవంతులు నా ఆత్మ స్వరూపులేయనెటి ఈ అతీత భావనిష్ఠను పొందిననాడు అనంతవిశ్వం నీదిగ భాసిల్లుతుంది. అందులకే క్షుధ్ర వ్యక్తిత్వ హద్దులనుమీరి అఖండ భావ సమాధి నిమగ్నులు కావాలి. దర్శనాంతర్ధానములు సముద్రము మీది తరంగముల వంటివి. జీవాత్మకు వినాశం లేదు. శక్తి పూరించబడునది తగ్గేది కాదు. శక్తి నశించదు, చావదు. హెచ్చు తగ్గులు దీనికి లేవు.
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో