బెజవాడ రైల్వేస్టేషన్ ఆధునిక ప్రమాణాలతో మరిన్ని హంగులు సమకూర్చుకోనుంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో నాలుగు రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించగా అందుతో విజయవాడ, గుంటూరు ఉన్నాయి. ఈ మేరకు రైల్వే బోర్డు రూ.26 కోట్లు విజయవాడకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా పేరొందిన బెజవాడ స్టేషన్‌కు అధునాతన హంగులు సమకూర్చుకొనేందుకు దశాబ్దకాలంగా రైల్వే కార్మిక సంఘాలు, ప్రయాణికుల సంక్షేమ సంఘాల పోరాటానికి ఫలితం దక్కింది. డివిజన్‌లో ఏకైక ఏ1 స్టేషన్‌గా పేరొందిన బెజవాడ రైల్వేస్టేషన్ తాజాగా రైల్వే బోర్డు వెలువరించిన ప్రకటనతో ప్రయాణికులకు ఉన్నత ప్రమాణాలతో మరిన్ని అధునాతన సౌకర్యాలు సమకూరనున్నాయి. అభివృద్ధి చెంది ప్రస్తుతం పది ప్లాట్‌ఫారాలకు విస్తరించింది. వన్‌టౌన్ వైపు ప్రయాణికుల రాకపోకల సంఖ్య పెరగడంతో తారాపేట రైల్వేస్టేషన్‌ను కొత్తగా నిర్మించారు. 1976లో అత్యాధునిక వ్యవస్థ గల రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ సిస్థం అమల్లోకి రాగా రెండేళ్ల కిందట రూ.50కోట్ల వ్యయంతో పూర్తి స్థాయిలో ఆర్‌ఆర్‌ఐని ఆధునికీకరించారు. ప్రస్తుతం జపాన్ పరిజ్ఞానం గల ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సైతం అందుబాటులోకి రాగా అన్ని ప్లాట్‌ఫారాలలో 24 బోగీల రైలు నిలుపే అవకాశం కలిగింది. డివిజన్‌లో ఏకైక ఏ1 స్టేషన్‌గా విజయవాడ రైల్వేస్టేషన్ రూపుదిద్దుకుంది. దేశంలో ఏ రైల్వేస్టేషన్‌కి లేని ఆరు మార్గాలు ఒక్క విజయవాడ స్టేషన్‌లోనే ఉన్నాయి. 1980 సంవత్సరంలో కేవలం రూ.20లక్షలున్న ఆదాయం ప్రస్తుతం రూ. 10వేల కోట్లకు చేరువలో ఉంది. దిల్లీ తరువాత ప్లాట్‌ఫాంపైకి నేరుగా కార్లు వచ్చే సౌకర్యం ఒక్క విజయవాడ రైల్వేస్టేషన్‌లోనే ఉంది. 1990లో రోజుకు 25వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా నేడు అన్‌సీజన్‌లో లక్ష నుంచి లక్షన్నర, సీజన్‌లో రెండు లక్షల వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 200లకుపైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజరు, ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. మరో 400 గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల టికెట్ల ద్వారా రోజుకు రూ.90 లక్షలు ఆదాయం లభిస్తోంది. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో విజయవాడ రైల్వేస్టేషన్ పరిశుభ్రతో నెంబరు వన్ స్థానంలో నిలిచింది. అత్యాధునిక యంత్రాల సహాయంతో అన్ని వేళల్లో ప్లాట్‌ఫారాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సౌరవిద్యుత్తు ఉపయోగంతో ఏటా రూ.లక్షల్లో ఆదా అవుతోంది. రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ఇక్కడి అధికారులు రైల్వే బోర్డుకు పంపగా ఇటీవల రూ.26కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు పనులు చేపట్టి ఈ ఏడాది డిసెంబర్‌లో పనులను పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించినట్లు సమాచారం. రైల్వేస్టేషన్ భద్రత త్వరలోనే మరింత పెరగనుంది. విమానాశ్రయం తరహాలో అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్‌లోని అన్ని ముఖద్వారాల వద్ద అత్యాధునిక డోర్‌ఫ్రేమ్‌లు, కిలోమీటరు దూరంలోనూ కనబడే సీసీ కెమేరాలు అమర్చనున్నారు. రైల్వేస్టేషన్‌కు మూడంచెల భద్రతా వ్యవస్థలో భాగంగా మరుగునపడిన సమీకృత భద్రతా వ్యవస్థ అమల్లోకి రానుంది.