సిమెంట్ ధరను తగ్గించండి
హైదరాబాద్ జూన్ 11
సిమెంట్ కంపెనీలతో మంత్రులు కే తారకరామారావు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లు గురువారం సమావేశమయ్యారు. ఈ భేటీలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ప్రస్తుతం నెలకొన్న కోవిడ్, లాక్డౌన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు సిమెంట్ బస్తా ధరను తగ్గించాలని మంత్రులు కోరారు. ఈ సంక్షోభం వలన అన్ని రంగాల మాదిరే రియల్ ఎస్టేట్ రంగం కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వంతో కలిసి రియాల్టీ రంగానికి చేయూతనిచ్చేందుకు ధరలను తగ్గించాల్సిన అవసరం ఉన్నదని సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు తేల్చిచెప్పారు. ప్రభుత్వం చేసిన సూచన కు సానుకూలంగా స్పందించిన కంపెనీలు, అంతర్గతంగా మాట్లాడుకుని వచ్చే వారంలో ఏ మేరకు ధరను తగ్గించేది ప్రభుత్వానికి తెలియజేస్తమని వెల్లడించారు. 2016 లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి 230 రూపాయలకి ఒక బస్తను ఇచ్చేందుకు అంగీకరించిన కంపెనీలు, మరో మూడేళ్ల పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తో పాటు ప్రభుత్వ పథకాలకు 230 రూపాయల యధాతథ ధరకి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. సిమెంట్ కంపెనీలు పెద్ద ఎత్తున నెలకొని ఉన్న హుజూర్నగర్ పరిసర ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో, అక్కడి యువతకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన శిక్షణ కేంద్రాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశంలో మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. సిమెంట్ కంపెనీలకు అవసరమైన సిబ్బందిని ఈ శిక్షణ కేంద్రం నుంచి తీసుకుంటామని, ఈ శిక్షణా కేంద్రానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు.