YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జీవో 3ని కొనసాగించేందుకు త్వరలో సుప్రీంలో రివ్యూ పిటిషన్

జీవో 3ని కొనసాగించేందుకు త్వరలో సుప్రీంలో రివ్యూ పిటిషన్

జీవో 3ని కొనసాగించేందుకు త్వరలో సుప్రీంలో రివ్యూ పిటిషన్
సుప్రీం కోర్టు గిరిజనుల స్థితిగతులు అధ్యయనం చేసి కొట్టివేసి ఉంటే బాగుండేది
జీవో 3పై మీడియా సమావేశంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, జూన్ 11
ఈ రాష్ట్రంలో తెలంగాణ గిరిజనుల హక్కులను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే సిఎం కేసిఆర్ జీవో 3 కొనసాగించేందుకు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి అంగీకరించారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ తెలిపారు. ఏజన్సీ ప్రాంతాల్లోని టీచర్ ఉద్యోగాలను 100 శాతం గిరిజనులతోనే భర్తీ చేసేందుకు వీలుగా 2000 సంవత్సరంలో ఇచ్చిన జీవో 3ని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడం దురదృష్టకరమన్నారు. గిరిజనుల అవకాశాలను దెబ్బతీసే సుప్రీం కోర్టు నిర్ణయం పట్ల రివ్యూ పిటిషన్ వేయడానికి సిఎం కేసిఆర్ అంగీకరించడంతో గురువారం  దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో  మంత్రి  సత్యవతి రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో సుప్రీం కోర్టు జీవో 3ని కొట్టివేసిందని, వెంటనే దీనిపై న్యాయవాదులు, న్యాయ నిపుణులతో చర్చించామని, సిఎం కేసిఆర్ గారు కూడా అంగీకరించడంతో త్వరలో సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిని పెట్టి రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. గిరిజనుల అవకాశాలను, హక్కులను కాపాడే జీవో 3 కొనసాగింపునకు రివ్యూ పిటిషన్ వేయడానికి అంగీకరించిన సిఎం కేసిఆర్ కి గిరిజనులందరి పట్ల ధన్యవాదాలు చెప్పారు. 2000 సంవత్సరంలో వచ్చిన జీవో 3వల్ల గత రెండు దశాబ్దాలుగా ఏజన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు విద్య, ఉద్యోగ రంగాల్లో కొంత అభివృద్ధి అయ్యారన్నారు. అయితే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న సమయంలో జీవో కొట్టివేయడం దురదృష్టకరమన్నారు. సుప్రీం కోర్టు ఇక్కడి స్థితి గతులను అంచనా వేసుకుని, అధ్యయనం చేసి జీవో 3పై నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. చట్టంపట్ల, న్యాయస్థానాల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని, రివ్యూ పిటిషన్ వేస్తే జీవో 3 కొనసాగిస్తారనే ఆశాభావంతో ఉన్నామన్నారు.  గిరిజనులకు అవకాశాలు కల్పించే జీవో 3ని కొనసాగించేందుకు కేంద్రం కూడా సహకరించాలని, దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల సంక్షేమానికి కేంద్రం కూడా కట్టుబడి ఉండాలని కోరారు. ఇప్పటికే రెండు సార్లు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాతో మాట్లాడినట్లు తెలిపారు.  రాష్ట్రంలో గిరిజనుల జనాభా దామాషా పద్దతి ప్రకారం గిరిజనుల రిజర్వేషన్లు పెంచడానికి కేంద్రం వద్ద కొట్లాడుతున్న సమయంలో ఈజీవో 3ని కొట్టివేయడం నిజంగా దురదృష్టకరమన్నారు.  ఈరాష్ట్రంలో వెనుకబడి ఉన్న గిరిజనులు మిగలిన వారితో సమానంగా అభివృద్ధి కావాలని అత్యధిక గురుకులాలు పెట్టి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం వల్ల ఇప్పుడిప్పుడు గిరిజనులు మిగిలిన వారితో పోటీ పడేవిధంగా తయారవుతున్నారన్నారు. సిఎం కేసిఆర్ గారు గిరిజనుల కోసం పాటుపడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం దీక్షలు చేస్తోందని విమర్శంచారు. దీక్షలు చేస్తే జీవో రాదని వారికి కూడా తెలుసని, అయినా సరే దీక్షలు చేస్తున్నారన్నారు. ఈ మీడియా సమావేశంలో కమిషనర్, కార్యదర్శి  క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి తదితరులున్నారు. 

Related Posts