YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కాటేసిన కరోనా.

కాటేసిన కరోనా.

కాటేసిన కరోనా..(తూర్పుగోదావరి)
కాకినాడ, జూన్ 11  కొబ్బరి పీచు పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రపంచ దేశాలను గడగడ వణికించిన కరోన వైరస్ ఎఫెక్ట్ ఇప్పుడు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ధనిక, పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను పట్టి కుదేపేసింది. కరోనా వైరస్‌ కారణంగా విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. లాక్‌ డౌన్‌ తో పరిశ్రమలు మూతపడ్డాయి. ఫలితంగా లక్షల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. వీటిపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయి. కరోన ప్రభావం, లాక్  డౌన్  ప్రక్రియ వీరి జీవితాలను అతలాకుతం చేసేశాయి.  కరోన వైరస్  నియంత్రంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్  డౌన్  ప్రక్రియతో... కొన్ని వర్గాల ప్రజల తలరాతలను మార్చేసింది.. దేశవ్యాప్తంగా కార్పొరేట్  సంస్థలు కోట్లల్లో నష్టాన్ని చవిచూస్తే... రోజు వారీ కూలీలు మాత్రం ఆకలి బాధను దిగమింగాయి. మధ్య, కుటీర, చిన్న తరహా పరిశ్రమల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో కొబ్బరి రేటు ఒక్కసారిగా పడిపోయింది. రైతులు పూర్తిగా నష్టపోయారు.. కొబ్బరి ఆధారిత పరిశ్రమల పరిస్థితి అంతకంటే దారుణంగా తయారైంది.కోనసీమ ప్రాంతంలో కొబ్బరి ఎక్కువగా దొరకడంతో.. కొబ్బరికాయను ఒలిచిన తర్వాత వచ్చే కొబ్బరి డొక్కపై ఆధారపడే పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఈ కొబ్బరి డొక్కను పీచు తయారి కోసం వాడతారు. తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 120 పీచు తయారీ పరిశ్రమలు, 300 తాళ్ల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ చిన్న తరహా పరిశ్రమను నమ్ముకుని 15 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కొబ్బరి డొక్కును ముడిసరుకుగా తీసుకుని పీచు తయారు చేస్తారు. ఈ విధంగా పీచు పరిశ్రమలు సామాన్య ప్రజల జీవనానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఒక పరిశ్రమలో సుమారు 20 నుండి 30 మంది పనిచేస్తారు. ఇక్కడ తయారైన పీచు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి జరుగుతుంది. కోనసీమ ప్రాంతంలో పీచు నాణ్యంగా ఉంటుందని ప్రత్యేకంగా ఈ ప్రాంతం నుండి కొనుగోలు చేసి తీసుకుని వెళ్తారు. అలాంటిది లాక్  డౌన్  తో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పరిస్థితి దయనీయంగా మారింది. ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రధానంగా కొబ్బరి పంట ఎక్కువగా ఉండడంతో చుట్టు పక్కల ప్రాంతాలలో పీచు పరిశ్రమలు సుమారు 20 వరకు ఉన్నాయి. వీటిలో పనిచేసే కార్మికులు సగం మంది ఆ ప్రాంతం వారైతే.. మిగిలిన వారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పని చేసే వారు ఉన్నారు. లాక్  డౌన్  కారణంగా పూర్తిగా రవాణా వ్యవస్థ స్తంభించి పోవడంతో చిన్నతరహా పరిశ్రమలు దాదాపు మూతపడ్డాయి. ఇక్కడ పని చేస్తున్న కార్మికులకు పని చేసిన రోజులకు మాత్రమే యజమానులు జీతం ఇస్తారు. గత రెండు నెలల నుండి పరిశ్రమలు మూత పడడంతో కార్మికులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పీచు పరిశ్రమకు పూర్తిగా కొబ్బరి డొక్కల మీదే ఆధారపడి నడుస్తుంది. అందుకోసం డొక్కలను ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంచుకుంటారు. అలాంటిది లాక్  డౌన్  తో రవాణా పూర్తిగా ఆగిపోయింది. నిల్వ ఉంచిన కొబ్బరి డొక్క పూర్తిగా పాడైపోయింది. యజమానికి లక్షల్లో నష్టం వాటిల్లింది. గత రెండు నెలల నుంచి పరిశ్రమ మూసి ఉన్నప్పటికి కరెంట్ బిల్లు రావడంతో యాజమాని నెత్తిపై బండవేసినట్లు అయ్యింది.. ప్రస్తుతం పరిశ్రమను తెరవాలి అంటే మరలా డొక్కను కొనుగోలు చేయాలి. అయితే కొబ్బరి రేటు ఒక్కసారిగా 10 రూపాయల నుండి 7 రూపాయలకు పడిపోవడంతో రైతులు కొబ్బరిని రాశులుగా వేసి నిల్వ ఉంచుతున్నారు. రేటు వచ్చినప్పడు అమ్మవచ్చులే అని ఎదురు చూస్తుంటే, వాటిపై ఆధారపడిన పీచు పరిశ్రమలు సరుకు లేక ఇబ్బందులు పడుతున్నాయి. కొబ్బరి డొక్క టన్ను 2 వేల రూపాయలు ఉంటే.. దాని ద్వారా తీసిన పీచు టన్ను ఖరీదు 7 వేల రూపాయలు ఉందని యజమానులు ఆవేదన చెందుతున్నారు. దానికి తోడు భవన నిర్మాణ పనులు ఆగిపోవడంతో దానికి అనుబంధంగా అవసరమైన ఇటుకలు తయారీ నిలిచిపోయింది. కొబ్బరి డొక్క నుండి వచ్చే ఊకను ఇటుకల తయారీకి వాడతారు. ప్రస్తుతం లాభం మాట అటు ఉంచితే... పెట్టిన పెట్టుబడి పోవడంతో దిక్కుతోచని స్థితిలో యజమానులు ఉన్నారు. పీచు పరిశ్రమ మనుగడ ఏ రకంగా చూసినా లాభాదాయకంగా లేదని యజమానులు గగ్గోలు పెడుతున్నారు. చిన్న, కుటీర, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంతైనా ఉంది... వారు బ్రతుకుతూ.. పది మంది జీవనానికి ఆధారమైన వారిని కాపాడుకోవాలి. చిన్న తరహా పరిశ్రమలపై ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించాలని కార్మికులు, యజమానులు కోరుకుంటున్నారు...

Related Posts