ఏడారి బతుకులు (నిజామాబాద్)
నిజామాబాద్, జూన్ 11 ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోతున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. ఏజెంట్ల ఉచ్చులో పడి స్వదేశానికి తిరిగిరాలేక 400 మంది భారతీయులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు వర్క్ పర్మిట్ లేదని జైల్లలో మగ్గుతుంటే... మరికొందరు చీకటి గదుల్లో బంధీలై జీవనం సాగిస్తున్నారు. సౌదీలో నరకయాతన అనుభవిస్తున్న తమను స్వగ్రామాలకు తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు బాధితులు మొరపెట్టుకుంటున్నారు. సౌదీలో ఉన్న భారతీయ కార్మికులకు వేతనాలు చెల్లించాలని గల్ఫ్ రిటర్నింగ్ వెల్ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో విదేశాంగ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను మంచిగా చూసుకోవాలనే తాపత్రయంతో విదేశాల బాట పడుతున్న తెలంగాణ వాసుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దేశం కాని దేశంలో దుర్భర పరిస్థితులు అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఏజెంట్ల మోసాలు ఓవైపు, సరిగ్గా జీతాలివ్వక సతాయించే కంపెనీలు మరోవైపు. ఇలా జీవనోపాధి వెతుక్కుంటూ సప్త సముద్రాలు దాటుతున్నా... గవ్వ ఆదాయం లేక గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన దయనీయ పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి చెందిన 35 మందికి పైగా సౌదీ అరేబియాలో మగ్గుతున్నారు. సౌదీ అరేబియా దేశంలోని బల్దియాలో పనీ కోసం ఢిల్లీకి చెందిన ట్రావెల్ క్రాప్ కంపెనీ ఆధ్వర్యంలో 2014జూన్ లో 400 మంది భారతీయులు వెళ్లారు. వీరిలో తెలంగాణ నుంచి 50మంది వెళ్లారు. ప్రస్తుతం సౌదీ కంపెనీ భారతీయ కార్మికులను ముప్పుతిప్పలు పెడుతోంది. 6 నెలలుగా జీతాలివ్వకుండా సతాయిస్తోంది. గత 15రోజులుగా తిండి తిప్పలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. చీకటి గదుల్లో మగ్గుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, బీహార్, ఉత్తర ప్రదేశ్, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన దాదాపు 400 మంది కార్మికులు ఈ కంపెనీ కోసం పనిచేయాగా, 6నెలల నుండి విధుల్లోంచి తొలగించి వేతనాలు చెల్లించడం లేదు. తెలంగాణ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 50మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. 2014 జూన్ లో వెళ్లగా వీరికి ప్రస్తుతం వీసా, లేబర్ కార్డు గడువు అయిపోయింది. వీసా రెన్యూవల్ చేయాల్సిన కంపెనీ చేతులెత్తేసింది. అంతేకాదు 6 నెలల నుంచి ఇప్పటివరకు జీతాల ఊసే లేదు. వీసా గడువు ముగిసి చాలాకాలం కావడంతో వారంతా క్యాంపుల్లో ఉండాల్సిన పరిస్థితి. చేతిలో చిల్లిగవ్వ లేక నానా తిప్పలు పడుతున్నారు. వీరిలో కొందరు గల్లంతు కాగా.... మరికొందరు జైల్లో మగ్గుతున్నారు. కొందరు మరణించిన వారి జాడ లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జీల్లా నుండి నందిపేట్, భీంగల్, ఆర్ముర్, మోర్తాడ్, కామారెడ్డి జిల్లా గాంధారి, మాచారెడ్డి, రామరెడ్డి మండలాలకు చెందిన యువకులు ప్రస్తుతం సౌదీలో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వెళ్లిన వారికి అక్కడ కంపెనీలు జీతాలు, తీసుకున్న వీసాలు తిరిగి ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుని స్వగ్రామాలకు చేరుకోవడం జరిగిందని బాధితులు వాపోయారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్సయ్య, శ్రీనివాస్ లు వాపోయారు. గల్ఫ్ లో చిక్కుకున్నవారిని స్వగ్రామాలకు తీసుకువచ్చి తెలంగాణ ఎన్ ఆర్ఐ పాలసీ అమలు చేయాలని కోరుతున్నారు. జీతాలివ్వక, తిండి పెట్టక కంపెనీ యజమానులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని బాధితులు గోడు వెల్లబుచ్చుతున్నారు. జీతాల గురించి అప్పుడు ఇప్పుడంటూ దాటవేస్తున్నారని... కనీసం తిండి కూడా పెట్టడం లేదని వాపోయారు. సౌదీలో లో బందీలుగా మారిన కార్మికులు దీనావస్థలో మగ్గుతున్నారు. వారి పాస్ పోర్టులను కూడా కంపెనీ యజమానుల వారిదగ్గరే పెట్టుకున్నారు. లేబర్ కార్డు గడువు ముగియడంతో స్వదేశానికి తిరగలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంపులో ఉన్నవారికి తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గల్ఫ్ నుంచి తిరిగి ఇండియాకు రావాలంటే ఒక్కొక్కరు దాదాపు లక్ష రూపాయల జరిమానా కట్టాల్సిన పరిస్థితి. లేబర్ కార్డు, వీసా లేకపోవతంలో నెలకు 35 రియాళ్ల ఫైన్ కట్టడం తో పాటు విమాన చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రవాసుల రక్షణ, గల్ఫ్ సంక్షేమం కోసం ఎన్నారై పాలసీని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందోనని ప్రవాసులు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా గల్ఫ్ ప్రవాస కార్మికులు ఈ పాలసీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నా పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైన తెలంగాణ రాష్ట్రం వెంటనే స్పందించాలని గల్ఫ్ సంక్షేమ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సౌదీలో ఉన్న వారికి వేతనాలు ఇప్పించాలని, జాడలేని వారి ఆచూకీ చూపించే దిశగా అడుగులు వేయాలని గల్ఫ్ బాధిత కుటుంబాలు కోరుతున్నారు.