YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

నాల్గో స్థానంలో  ఇండియా

నాల్గో స్థానంలో  ఇండియా

నాల్గో స్థానంలో  ఇండియా
న్యూఢిల్లీ, జూన్ 12,
అనుకున్నంతా అయ్యింది. మనదేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. ప్రపంచంలో కేసుల ఉధృతిలో నాలుగవస్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత స్థానం పొందింది. కేసులలో మనం ఇంగ్లాండ్, స్పెయిన్ ఇటలీ దేశాలను దాటేశాం. ఏకంగా 10,866 కేసులు ఒక్కరోజే నమోదయ్యాయి. కరోనాకేసుల సంఖ్య ప్రతినిత్యం పదివేలకు చేరువలో ఉంటుంది. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 2,87,754 కు చేరింది. జూన్ 1 నుండి దేశం ప్రతిరోజూ 10,000 కేసులకు దగ్గరగా కేసులు నమోదు చేస్తోంది. అంటే జూన్ 1 నుండి 10 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 90,000 కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా దెబ్బతిన్న నాలుగవ దేశమైన ఇంగ్లాండ్ ను అధిగమించాం. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదవుతున్నాయి. భారతదేశం కంటే ముందు ఎక్కువ కేసులతో అమెరికా, బ్రెజిల్, రష్యా మాత్రమే ఉన్నాయి. ఈ మూడు దేశాలలో కరోనా పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. అయితే ఈ మూడు దేశాల కంటే భారతదేశం మెరుగైన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అత్యధిక కేసులు ఉన్న టాప్ 5 దేశాలు యుఎస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, యుకె స్థానం పొందాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ప్రస్తుతం 20లక్షల 77 వేల 139 పాజిటివ్ కేసులు ఉండగా, కరోనా కారణంగా లక్షా 15 వేల 572 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే  అమెరికాలో 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక రెండవ స్థానంలో వున్న బ్రెజిల్లో నిన్న 12 వేల 305 కేసులు నమోదు కాగా 40, 275 మంది మరణించారు. అక్కడ మొత్తం పాజిటివ్ కేసులు 7 లక్షల 87 వేల 489 కేసులు నమోదయ్యాయి. రష్యాలో 5 లక్షల 2 వేల 436 కేసులు, 6532 మరణాలు సంభవించాయి. మన దేశం తర్వాత 5వ స్థానంలో వున్న బ్రిటన్లో కేసులో 2 లక్షల 91 వేల 409 కేసులున్నాయి. అక్కడ నిన్న 9 వేల వరకూ కేసులు నమోదవ్వగా ఇప్పటివరకూ41,279 మంది మరణించారు. మనదేశంలో 1.42 లక్షలు యాక్టివ్ కేసులు. కరోనా నుండి సుమారు 1.46 లక్షల మంది కోలుకున్నారు. సుమారు 8500 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 75.34 లక్షల కేసులు నమోదయ్యాయి. వీరిలో 4.21 లక్షల మంది మరణించారు. మనదేశంలో మహారాష్ట్రలో పరిస్థితి ఏ మాత్రం మారలేదు.. కరోనా కారణంగా ఆ రాష్ట్రంలో ఒక్క రోజే 149 మంది మరణించారు. ఒక్కరోజే ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3254 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 94,041కి ఎగబాకింది. అక్కడ కరోనా పేషెంట్లకు బెడ్లు సరిపోవడం లేదు.పరిస్థితి హృదయవిదారకంగా మారింది. మహారాష్ట్రలో మొత్తం మరణాల సంఖ్య 3,438 దాటింది. మహారాష్ట్ర తొలి మరణం ఏప్రిల్ 18న సంభవించింది. దేశ వాణిజ్య నగరం ముంబైని కరోనా వణికిస్తోంది. ఒక్క ముంబై నగరంలోనే కరోనాతో 1855 మంది మరణించారు. బుధవారం ముంబైలో 1567 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో కేసుల సంఖ్య 52,445కు చేరింది. ఇప్పటికే ఈ కేసుల సంఖ్య వుహాన్ నగర కేసులను దాటిపోయాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 47.34 శాతంగా ఉండగా.. మరణాల రేటు 3.65 శాతంగావుంది. వలస కూలీల వల్ల కూడా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పరిమితిని దాటిపోతున్నాయి. 

Related Posts