YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కరీంనగర్ రాజకీయాలు

పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కరీంనగర్ రాజకీయాలు

పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కరీంనగర్ రాజకీయాలు
కరీంనగర్, జూన్ 12,
 ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర‌మైన రాజ‌కీయం మొద‌లైంది. బీజేపీ ఎంపీపై టీఆర్ఎస్ నాయ‌కులు, టీఆర్ఎస్ మంత్రుల‌పై బీజేపీ నాయ‌కులు పోలీస్ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ త‌మ‌కు క‌నిపించ‌డం లేద‌ని చేసిన ఒక రోజు దీక్ష‌తో ఈ త‌ర‌హా రాజ‌కీయం మొద‌లైంది. ఇప్పుడు ఉమ్మ‌డి జిల్లాలోని ముగ్గురు మంత్రులు క‌నిపించ‌డం లేదంటూ బీజేపీ కౌంట‌ర్ మొద‌లుపెట్టింది. త‌మ మంత్రుల‌ను వెతికిపెట్టాలంటూ బీజేపీ నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నారు.ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల వ‌ర‌కు టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ వార్ న‌డిచేది. అయితే, క‌రీంన‌గ‌ర్ ఎంపీగా బీజేపీ త‌ర‌పున బండి సంజ‌య్ అనూహ్య విజ‌యం సాధించ‌డంతో జిల్లాలో రాజ‌కీయ ముఖ‌చిత్ర‌మే మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వెన‌క్కు వెళ్లిపోగా టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్య జిల్లాలో రాజ‌కీయ వార్ న‌డుస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రాతినిత్యం వ‌హించి, టీఆర్ఎస్‌కు ప‌ట్టున్న క‌రీంన‌గ‌ర్ లోక్‌స‌భ స్థానం నుంచి టీఆర్ఎస్ కీల‌క నేత బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్‌పై విజ‌యం సాధించి బండి సంజ‌య్ షాక్ ఇచ్చారు.బండి సంజ‌య్ గెలుపుతో జిల్లాలో బీజేపీ మ‌రింత బ‌లోపేత‌మైంది. ఇటీవ‌ల ఆ పార్టీలోకి వ‌ల‌స‌లు కూడా పెరిగాయి. ఒక  బండి సంజ‌య్‌కు రాష్ట్ర బీజేపీ ప‌గ్గాలు కూడా ద‌క్క‌డంతో టీఆర్ఎస్‌కు ఆయ‌న టార్గెట్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్ జిల్లా కొత్త‌ప‌ల్లి మండ‌లం బావుపేట‌లో కొంద‌రు మా ఎంపీ బండి సంజ‌య్ క‌నిపించ‌డం లేద‌ని, మా ఎంపీ మాకు కావాలి అంటూ ఒక రోజు దీక్ష చేయ‌డం రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే, ఈ దీక్ష వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీ నేత‌లు ఉన్నార‌ని బీజేపీ ఆరోప‌ణ‌లు మొద‌లుపెట్టింది.దీక్ష అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యింద‌ని, రైతుల‌కు విష‌యం చెప్ప‌కుండా దీక్ష‌కు కూర్చోబెట్టి ఎంపీ క‌నిపించ‌డం లేద‌ని వెనుక బ్యాన‌ర్ పెట్టార‌ని, ఈ విష‌యం తెలిసి రైతులు అంతా వెళ్లిపోయార‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. అంతేకాదు, దీక్ష అంతా టీఆర్ఎస్ స్కెచ్ అని ఆరోపిస్తూ టీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్‌విగా చెబుతున్న కొన్ని మెసేజ్‌ల స్క్రీన్ షాట్‌ల‌ను కూడా బ‌య‌ట‌పెట్ట‌డంతో అవి వైర‌ల్ అయ్యాయి. ఇలా అనేక ప్ర‌య‌త్నాల ద్వారా బండి సంజ‌య్‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన దీక్ష ఉత్త‌దేన‌ని బీజేపీ చెప్పుకునే ప్ర‌య‌త్నాలు చేసింది.ఇప్పుడు టీఆర్ఎస్‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు కూడా అదే స్ట్రాట‌జీని అమ‌లు చేస్తోంది. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని ముగ్గురు మంత్రులు క‌నిపించ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు మొద‌లుపెట్టింది. బండి సంజ‌య్ క‌నిపించ‌డం లేద‌ని ఫిర్యాదు చేసిన కొత్త‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లోనే బీజేపీ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ క‌నిపించ‌డం లేదంటూ ఓ ఫిర్యాదు చేసింది.మంత్రి కేటీఆర్ క‌నిపించ‌డం లేద‌ని ఎల్లారెడ్డిపేట‌లో ఫిర్యాదు చేశారు. మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్‌, కేటీఆర్‌, ఈటెల రాజేంద‌ర్‌లు క‌నిపించ‌డం లేద‌ని, వెతికిపెట్టాల‌ని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు చేయాల‌ని బీజేపీ నాయ‌కులు ప్లాన్ చేశారు. త‌మ నాయ‌కుడిని ఇబ్బంది పెట్టేందుకు టీఆర్ఎస్ చేసిన ప్లాన్‌కు ఈ ర‌కంగా కౌంట‌ర్ ఇస్తున్నారు క‌రీంన‌గ‌ర్ బీజేపీ నాయ‌కులు. మొత్తానికి ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం క‌నిపిస్తోంది.

Related Posts