పలాస జీడిపప్పుకు కరోనా ఎఫెక్ట్
శ్రీకాకుళం, జూన్ 12
కరోనా లాక్‌డౌన్‌లో జీడి పరిశ్రమలకు సడలింపులు ఇవ్వడంతో కార్మికులకు ఉపాధి లభిస్తోంది. అయితే వాటి ఉత్పత్తులకు మాత్రం గిరాకీ లేకపోవడంతో సంబంధిత యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీడి పప్పు ఉత్పత్తి ఎగుమతుల్లో జాతీయ స్థాయిలోనే పలాస జీడి పప్పు ప్రసిద్ధి పొందింది. కరోనా ప్రభావంతో దీనికి గతేడాది కన్నా ఈ ఏడాది గిరాకీ తగ్గింది. ఫలితంగా జీడి పప్పు నిల్వలు పేరుకుపోతున్నాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సంక్రాంతి తర్వాత నుంచి జీడి పప్పు ధరలు ఎక్కువగా పెరుగుతాయి. మార్చి నుంచి మే వరకు వివిధ శుభకార్యాలు, పండగలు, ఉత్సవాలు సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు జీడి పప్పు ఎగుమతి కావడం వల్ల ధరలు కూడా అందుకనుగుణంగా పెరుగుతూ వచ్చేవి. కరోనా ప్రభావంతో వర్తక, వాణిజ్యం స్తంభించింది. ఆ ప్రభావం పలాస జీడి పప్పు మార్కెటుపైనా పడింది. దీంతో ధరలు అనూహ్య రీతిలో తగ్గుముఖం పట్టాయి. గతేడాది కిలో జీడి పప్పు నాణ్యత బట్టి రూ.700 నుంచి రూ.750 వరకు ఉండేది. ఈ ఏడాది నంబరు వన్ జీడి పప్పు రూ.650కు తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. గిరాకీ తగ్గడంతో ముడిసరుకు జీడి పిక్కల ధరలు కూడా బాగా తగ్గిపోయాయి. ఉద్దానం ప్రాంతంలో ఈ సీజన్‌లో జీడి పిక్కలకు మంచి డిమాండ్ ఉండేది. కొనుగోలు అమ్మకాలు బాగా సాగేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రైతులు తమ పంటకు కనీసం గిట్టుబాటు ధర 80 కిలో జీడి పిక్కల బస్తాకు రూ.15 వేలు కావాలని కోరుతుండటంతో వ్యాపారులు గ్రామాల్లోకి వెళ్లడం లేదు. ఉద్దానంలో పిక్కలు అమ్మకాలు కొనుగోలు స్తంభించిపోయాయి. ప్రస్తుతం పలాస మార్కెట్‌లో 80 కిలోల జీడి పిక్కల బస్తా రూ.8 వేలు ఉంది. ధరలు ఎప్పుడు పెరుగుతాయా అని ఇటు వ్యాపారులు, అటు రైతులు ఎదురు చూస్తున్నారు.