ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు బిహార్‌లో దేశంలో అత్యంత శక్తిమంతమైన విద్యుత్ రైలింజన్‌ను ఆయన ప్రారంభించారు. 12000 హర్స్‌పవర్ సామర్థ్యం గల ఈ విద్యుత్ రైలింజన్(ఎలక్ట్రిక్ లోకోమోటివ్) మాధేపురాలోని విద్యుత్ రైలింజన్ల తయారీ ఫ్యాక్టరీలో రూపొందించారు. దేశంలో అత్యంత శక్తిమంతమైన విద్యుత్ రైలింజన్ ఇదే. అంతకుముందు 6000 హార్స్‌పవర్ రైలింజన్ మాత్రమే ఉండేది.ఈ రైలింజన్‌తో రష్యా, చైనా, జర్మనీ, స్వీడన్ లాంటి దేశాల సరసన భారత్ చేరింది. ఈ ఇంజిన్ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. వీటిని ఎక్కువగా బొగ్గు, ఇనుప ఖనిజాల రవాణాకు ఉపయోగిస్తారు.మేకిన్ ఇండియాలో భాగంగా భారత రైల్వే, ఫ్రాన్స్‌కు చెందిన అల్‌స్టామ్ సంస్థ సంయుక్తంగా మాధేపురాలో విద్యుత్ రైలింజన్ల తయారీ పరిశ్రమను ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో ఏడాదికి 110 రైలింజన్లు తయారుచేయవచ్చు. 11ఏళ్లలో 800 రైలింజన్ల తయారీ లక్ష్యంతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు. తాజా పర్యటనలో ఈ పరిశ్రమను మోదీ జాతికి అంకితం చేశారు.వీటితో పాటు ముజఫర్‌పూర్-సగౌలీ, సగౌలీ-వాల్మికీనగర్ డబ్లింగ్ పనులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కతిహార్- దిల్లీ మధ్య తొలి రైలు చంపారన్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.