నేను నికార్సైన హిందువును సినీ నటుడు నాగబాబు
కాషాయం కండువా చాలా విలువైనది
హైదరాబాద్ జూన్ 12
"శాంతి.. సహనం.. ఓపిక ..ధర్మం అనే పదాలు ఉపయోగించి హిందువులలో ఉన్న పౌరుషాన్ని, ఆగ్రహాన్ని కొంతమంది పెద్దలు చంపేశారు" అని ప్రముఖ సినీ నటుడు నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వేల, లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన హిందుత్వాన్ని నేడు అంటరాని దానిగా చేశారని అభిప్రాయపడ్డారు. పరమత సహనం గల హిందువుల రక్తంలో దురాక్రమణ అనేదానికి చోటే లేదని, దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. స్వతహాగా తాను నాస్తికుడిననీ, ( దేవుడికి మాత్రమే పూజ చెయ్యను) కానీ నికార్సైన హిందువుని అని గర్వంగా చెప్పారు. హిందూ సంస్కృతి.. సంప్రదాయం.. ఆచార వ్యవహారాలు.. కట్టుబాట్లు.. సేవా తత్వం.. నియమనిష్టలు.. అన్ని కూడా నచ్చుతాయని, అందుకే.. "నేను హిందుత్వాన్ని పూర్తిగా నమ్ముతానని" అని చెప్పారు. హిందుత్వం అనేది భరత భూమిలో పుట్టిన మతం అని, మిగతావి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వేనని వివరించారు. "ధర్మం వేరు, హిందుత్వం వేరు.. హిందుత్వం అనేది అతి పవిత్రమైన.. పురాతనమైన.. శ్రేష్టమైన మతం" అని నాగబాబు చెప్పారు. ప్రస్తుతం హిందుత్వాన్ని పెకిలించి వేయాలని అనేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే హిందుత్వాన్ని కాపాడుతున్నది విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ మాత్రమేనని ఉదాహరణలతో సహా వివరించారు. ఈ దేశం పై ప్రేమ, అభిమానాలు ఉన్నది స్వయంసేవకులకు మాత్రమేనని అన్నారు. దేశంలో ఉంటూ వందేమాతరం కూడా పలకని వారు చాలా మంది ఉన్నారని విమర్శించారు. గోవులను రక్షిస్తూ, మత మార్పిడులను అడ్డుకుంటూ ప్రాణాలకు తెగించి పని చేస్తున్న విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు నిజమైన భరతమాత పుత్రులు అని అన్నారు. "ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థల్లో ప్రచారక్ వ్యవస్థ చాలా గొప్పదని" అభివర్ణించారు. జీవితాలను త్యాగం చేసి, సర్వం హిందుత్వ వ్యాప్తి కోసం పని చేయడం పూజనీయమని చెప్పారు. శుక్రవారం నాగబాబు గారిని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్, భాగ్యనగర్ అధ్యక్షులు శ్రీనివాస్ రాజా , ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ స్టేట్ కో కన్వీనర్ శివరాములు మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగబాబు అనేక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాశ్మీర్ లో పండితులను ఊచకోత కోస్తే స్పందించని వారు, మహారాష్ట్రలో సాధువులను క్రూరంగా చంపేస్తే చలించని వాళ్లు, దేశంలో అనేకచోట్ల హిందువులపై ఘోరాలు జరుగుతున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మీడియా, సెక్యులరిస్టు లు అందరూ కూడా నేడు.... అమెరికాలో ఎవరో ఒక వ్యక్తిని చంపేస్తే స్పందించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ దేశంలో గాడిద చనిపోతే విలువ ఉంది కానీ, హిందువు హత్యకు గురైతే అడిగే వారే లేరని అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా హిందువులంతా చైతన్యమై తేనే భారతదేశ మనుగడ సాధ్యమని, లేదంటే చాలా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.