జూలై చివరి వరకు ప్రైవేట్ కంపెనీలకు సుప్రీం కోర్టు వెసులుబాటు
న్యూ ఢిల్లీ జూన్ 12,
ప్రైవేట్ కంపెనీలకు భారీ ఉరటనిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. లాక్ డౌన్ వేళ ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేకపోతున్న ప్రైవేట్ కంపెనీల పై ఎలాంటి చర్యలకు ఆదేశించడం లేదని సుప్రీం తెలిపింది. జూలై చివరి వరకు ప్రైవేట్ కంపెనీలకు ఈ వెసులుబాటును కల్పించబోతున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ప్రైవేట్ సంస్థలు ఉద్యోగస్థులతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవాలని తన ఆదేశంలో న్యాయస్థానం తెలిపింది. అయితే వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించగా.. ఆ సమయంలో ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని కేంద్ర హోంశాఖ మార్చి నెలలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలు కంపెనీలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ అంశంపై వివాదం సరికాదని తెలిపింది. పరిశ్రమలు కార్మికులు ఒకరికి ఒకరు అవసరమని తన తీర్పులో వెల్లడించింది. ఇక ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.