Highlights
- జులై లోపు పంచాయతీ ఎన్నికలు?
- కొత్త పంచాయతీరాజ్ చట్టం ఇంకా ఆమోదం పొందలేదు
- రాజకీయపార్టీల అభ్యం తరాలను పరిగణనలోకి తీసుకుంటాం
- ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. మాసబ్ ట్యాంక్‌లోని ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తెరాస, కాంగ్రెస్, భాజపా, తెదేపా, సీపీఐ, సీపీఎంతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు పాల్గొని తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలను నూతన చట్టం ప్రకారం నిర్వహిస్తారా లేకపోతే పాత చట్టం ప్రకారం నిర్వహిస్తారా అని కమిషనర్ వద్ద రాజకీయపార్టీలు ప్రస్తావించాయి. జులై లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఇంత తక్కువ సమయంలో కొత్తగా ఏర్పడబోయే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యమా అని నేతలు సందేహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా కూడా పారదర్శకంగా రూపొందించాలని ఎన్నికల కమిషనర్‌ను కోరారు. రాజకీయ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌నేత మర్రి శశిధర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెదేపానేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మొదటి దశ ఓటర్ల జాబితా ప్రచురణపై చర్చించామని పేర్కొన్నారు. జులై లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు.