YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనాల్లోకి మళ్లీ జగన్

జనాల్లోకి మళ్లీ జగన్

జనాల్లోకి మళ్లీ జగన్
విజయవాడ, జూన్ 13
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటనకు సన్నద్ధం అవుతున్నారు. తన పర్యటనలో భాగంగా క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలును పరిశీలించనున్నారు. ఈలోపు అర్హులైన ప్రజలు ఎవరూ కూడా తమకు సంక్షేమ పథకాలు అందలేదని ఫిర్యాదులు చేయకూడదని, చేయి ఎత్తకూడదని ఆయన స్పష్టం చేశారు.. లబ్ధిదారుల జాబితా, గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన నంబర్ల జాబితా, ప్రకటించిన విధంగా నిర్ణీత కాలంలో అందే సేవల జాబితా, ఈ ఏడాదిలో అమలు చేయనున్న పథకాల క్యాలెండర్‌ను అన్ని గ్రామ, వార్డు, సచివాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందులో అలసత్వం జరక్కుండా చూసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల జాభితా సచివాలయాల్లో ఉంచారా? లేదా? అన్నదానిపై ఈనెల 20లోగా జియో ట్యాగింగ్, వెరిఫికేషన్‌ పూర్తవుతుందని అధికారులు సీఎంకు వివరించినట్టు తెలుస్తోంది. మార్చి 2021 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సొంత భవనాల నిర్మాణం పూర్తికావాలని సీఎం ఆదేశించారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ ఉన్న 17097 పోస్టుల భర్తీకి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన అధికారులు.. జూలై నెలాఖరులో పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నామన్నారు. వైద్యశాఖలో పోస్టులు, గ్రామ–వార్డు సచివాలయాల్లో పోస్టులు అన్నీ కలిపి వాటికి ఒకేసారి షెడ్యూల్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శిక్షణపై వివరాలు అధికారులు అందించారు. ఇటు వాలంటీర్లకు శిక్షణపైనా ఆరా తీసిన సీఎం.. వారికి సెల్‌ఫోన్లు ఇచ్చినందున డిజిటిల్‌ పద్ధతుల్లో శిక్షణ ఇచ్చే ఆలోచన చేయాలని సూచించారు. పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఎవరి దరఖాస్తులను తిరస్కరించకూడదన్న సీఎం.. అర్హత ఉన్న వారికి పథకాలు రాకపోతే... అధికారులను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. పెన్షన్, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీకార్డు, రేషన్‌ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలని, మొదట వీటిపై దృష్టి పెట్టాలన్నారు. వీటిలో దేనికైనా దరఖాస్తు చేసినప్పటినుంచీ అది ఏస్థాయిలో ఉందో తెలుస్తుందన్న అధికారులు.. అకనాలెడ్జ్‌మెంట్‌ కోసం ఇచ్చిన నంబరు ఆధారంగా దరఖాస్తు దారుడు తన దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చని సీఎంకు వివరించారు.
 

Related Posts