భూముల కోసమే సినీ పెద్దల క్యూ
విశాఖపట్టణం, జూన్ 13
విశాఖకు ఎన్నో పేర్లు, ఆర్ధిక రాజధాని, సాంస్క్రుతిక రాజధాని, పర్యాటక రాజధాని, విద్యా రాజధాని, పారిశ్రామిక రాజధాని ఇలా టీడీపీ హయాంలో ఎన్నో పేర్లు వల్లె వేశారు. ఏవీ కాకుండానే ఈ మెగాసిటీ నిలిచిపోయింది. ఇపుడు ఏలికలు మారారు. వైసీపీకి కూడా విశాఖను ఏదో చేసేయాలని ఉంది. అందుకే ముందుగా పాలనారాజధానిని విశాఖను తెస్తామని భారీగానే ప్రకటించింది. అంతే వేగంగా దానికి బ్రేకులు కూడా పడిపోయాయి. సరే ఇపుడు సినీ రాజధాని అంటోంది. టాలీవుడ్ ప్రముఖులతో భేటీలు పెడుతోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది.నిజానికి విశాఖకు ఉమ్మడి ఏపీలో ఏ సిటీకి లేని అందాలు, హంగులు ఉన్నాయి. ఎత్తు అయిన పచ్చని కొండలు, ఎదురుగా గంభీర సాగరం, పచ్చని పంట పొలాలు, మైదానాలు, గిరి సీమలు, ఇలా విశాఖలో సౌందర్యానికి లోటు లేదు, సినీ పెద్దలు కనుక వీటిని సొమ్ము చేసుకుంటే ఇంతకంటే మంచి లొకేషన్లు కూఒడా ఎక్కడా దొరకవు. గతంలో విశాఖలోనే ఎక్కువగా షూటింగులు జరిగేవి, ఎపుడైతే హైదరాబాద్ లో సినిమా పరిశ్రమ స్థిరపడిందో నాటి నుంచి విదేశీ మోజు పెరిగింది. విశాఖ వైపు చూపు తగ్గింది.విశాఖను సినీ రాజధాని చేస్తామని చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచి ప్రతిపాదనలు ఉంటూనే ఉన్నాయి. ఆయన టైంలో విశాఖ భీమిలీ ప్రాంతంలో భూములు కూడా కొంతమంది సినీ పెద్దలకు ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు మాత్రం మాటలకే పరిమితం అయ్యారు. సినిమా పెద్ద ఎన్టీయార్ చేతుల మీదుగా పుట్టిన టీడీపీ ఈ విషయంలో ఏమీ చేయలేకపోయిందనే చెప్పాలి. ఆ పార్టీ కంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులే అంతా చేశారు. ఇపుడు వైఎస్సార్ కాంగ్రెస్ హయాం నడుస్తోంది. జగన్ పట్టుదలగా ఉన్నారు. విశాఖలో సినీ పరిశ్రమను కొంత అయినా షిఫ్ట్ చేసి ఇక్కడ సినిమా యాక్టివిటీ పెంచాలనుకుంటున్నారు.అయితే ఇక్కడ చిక్కులు చాలా ఉన్నాయి. హైదరాబాద్ వదిలి రావాలంటే ఆంధ్రా మూలాలు ఉన్న నిర్మాతలు, హీరోలు ఎవరూ ఇప్పటికీ పెద్దగా సుముఖంగా లేరు. వారంతా దేవుడి మీద భక్తితో కాదు, ప్రసాదాల మీదనే తమ భక్తిని చూపుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. చెన్నారెడ్డి టైంలో భూములు పొందిన వారు వాటిని అలాగే ఖాళీ పెట్టి ఉంచారు. ఇక రామానాయుడు ఒక్కరే స్టూడియో కట్టారు. ఇపుడు కూడా జగన్ సర్కార్ పెద్ద ఎత్తున భూములు ఇవ్వడానికి ప్లాన్ రెడీ చేస్తోంది. వాటిని పొందడానికి టాలీవుడ్ పెద్దలు కూడా క్యూ కడుతున్నారు. మరి భూములు తీసుకుని నిర్మాణాలు చేయకపోతే ఫలితం ఏమీ ఉండదు, పైగా ఇప్పటికే అభివృధ్ధి చెందిన హైదరాబాద్ సినీ పరిశ్రమలోనూ భూములు తీసుకున్న వారు రియల్ వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అందువల్ల వైసీపీ సర్కార్ టైం బాండ్ ప్రొగ్రాం పెట్టుకుని షరతులు పెట్టి భూ పందేరాలు చేయాలని అంటున్నారు. సరైన సమయానికి స్టూడియోకు కట్టకపోయినా, ఇచ్చిన ఉద్దేశ్యాలను విస్మరించినా తిరిగి భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా రూల్స్ ఫ్రేమ్ చేస్తేనే విశాఖకు సినీ రాజధాని ఆశలు కొంతైనా నెరవేరుతాయని అంటున్నారు.