15 వ ఆర్థిక సంఘం సిఫార్సులపై దక్షిణాది రాష్ట్రాల ఆర్థికమంత్రులు తిరువనంతపురంలో సమావేశమయ్యారు. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై కూలంకుశంగా చర్చిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలను యథాతథంగా అమలుచేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అంశంపై ఆయా చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్థిక సంఘాలన్నీ 1971 జనాభాలెక్కల ప్రకారం రాష్ట్రాలకు నిధులు కేటాయించాయి. అయితే ఈ సారి 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇది దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులపై తీవ్ర నష్టం కలిగించబోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం మరింత ఎక్కువగా చూపనుంది. కేంద్రం నుండి వచ్చే నిధుల బదిలీలు, మూలధన ఆదాయాలపైనే ఆధారపడి ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక ఇక్కట్లను మిగల్చనున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. దక్షిణాది రాష్ట్రాలు సమైక్య గళాన్ని వినిపిస్తన్నాయి. అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే ఆర్థిక సంఘం రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందులకు తగిన ప్రాధాన్యతనివ్వాలన్న డిమాండ్‌వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. కేరళ ఆర్థిక మంత్రి చొరవ తీసుకుని 15వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేరళలో జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ, కర్నాటక రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ఆర్థికమంత్రులు మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు. 2011 జనాభా ప్రాతిపదికన కాకుండా 1971 జనాభా లెక్కల ప్రాతిపదికగానే 15వ ఆర్థిక సంఘం సిఫారసులు ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు.