పాకిస్తాన్ కు భారత్ స్వీట్ వార్నింగ్
న్యూఢిల్లీ, జూన్ 13,
ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఆర్థికవ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. సరైన ముందుజాగ్రత్తలు లేకుంటే దేశాల ఆర్థికమూలాలు దెబ్బతినడం ఖాయం. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే జనాభాలో రెండవ అతిపెద్ద దేశమయిన భారత్ అనేక చర్యలు చేపట్టింది ఆత్మనిర్భర భారత్ పేరుతో ఆర్థిక వ్యవస్థను చక్కబరిచే పని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, పొరుగున వున్న పాకిస్థాన్ భారత్ కు పాఠాలు నేర్పడానికి ప్రయత్నించి భంగపడింది. లాక్‌డౌన్‌త్లో ఉపాధి కోల్పోయిన తమపౌరుల ఖాతాలకు నగదు బదిలీచేశామని, నగదుబదిలీలో భారత్ కోరితే సాయానికి సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ట్వీట్లను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ట్వీట్లకు కౌంటర్ ఇచ్చింది. తమ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లు పాకిస్తాన్ ఏడాది జీడీపీతో సమానమని గుర్తుచేసింది. ‘సొంత పౌరులకు నగదు ఇవ్వడం కంటే బయటి దేశాల్లోని బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయడమే పాకిస్తాన్‌కు బాగా తెలుసు.
ఇమ్రాన్ ఖాన్ కొత్త సలహాదారులను నియమించుకోవాల్సిన అవసరం ఉంది. భారత దేశంలో ఏం జరుగుతుందో ఇమ్రాన్ సరైన సమాచారం తెలుసుకోవాలి’ అంటూ భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ కౌంటర్ ఇచ్చారు. ఇది పాకిస్తాన్ కు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. సీమాంతర ఉగ్రవాద ముఠాలకు సాయం చేస్తూ ఇతర దేశాల్లో తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ భారత్ కు సాయం చేస్తామనడం హాస్యాస్పదమని పలువురు రాజకీయనేతలు విమర్శించారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, పూటగడవక ఆందోళన చెందే కార్మికుల సంక్షేమం, ఆహార, ఆర్థిక భద్రత కోసం భారత్ ఆత్మనిర్థర ప్యాకేజీని కేటాయించారు.ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విజయవంతమైన, పారదర్శక నగదు బదలీ కార్యక్రమాన్ని భారత్‌తో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. భారత్‌లో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయిందని ఒక నివేదికలో తేలింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ భారత్‌లోని పేదలకు నగదు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ట్విటర్‌లో పేర్కొనడం చర్చకు దారితీసింది. దేశంలోని 34 శాతం కుటుంబాలు ప్రత్యేక్ష నగదు సాయం లేకుండా కనీసం ఒక వారం రోజులు కూడా మనుగడ సాగించలేవని ఇమ్రాన్ తెలిపారు. కరోనా కష్ట కాలంలో పాకిస్తాన్‌లో తమ ప్రభుత్వం తొమ్మిది వారాల్లో 120 బిలియన్లను పారదర్శకంగా 10 లక్షల కుటుంబాలకు బదిలీ చేసిందని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి అభివృద్ధి పథంలో పయనించే విధంగా ప్రధాని నరేంద్రమోడి రూ. 20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజిని ప్రకటించారు. భారత దేశ జిడిపిలో దాదాపు 10 శాతానికి సమానమైన ప్యాకేజి ఇది. ప్రపంచంలో అతిపెద్ద రిలీఫ్ ప్యాకేజిల్లో ఇది ఒకటి.ఎకానమీ, మౌలికరంగం, సాంకేతికత ఆధారిత రంగాలు, జనాభా, ఉత్పత్తులకు డిమాండ్ అనే అయిదు అంశాలు మూల స్తంభాలుగా ఆత్మనిర్భర్ ప్యాకేజి పనిచేస్తుంది.కరోనా లాక్ డౌన్ ప్రకటించిన తొలి రోజుల్లోనే ప్రధానమంత్రి పేదల కోసం ఒక లక్షా 70 వేల కోట్ల రూపాయలతో గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 42 కోట్ల మంది నిరుపేదలకు 53 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. జనధన్ ఖాతాలున్న 41 కోట్ల మంది మహిళలకు వారి ఖాతాల్లో రెండు విడతలుగా రూ.20,320 కోట్లు జమచేశారు.దాదాపు 3 కోట్లమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రెండు దఫాలుగా 3 వేల కోట్లు పంపిణీ చేసింది.పేదరికంతో అల్లాడుతున్న పాకిస్తాన్ తమ పౌరులకు సరైన మౌలిక వసతుల గురించి ఆలోచించకుండా ఇతర దేశాలకు సాయం చేస్తామనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.