16 నుంచి దోస్త్ అడ్మిషన్లు
హైద్రాబాద్, జూన్ 13
రాష్ట్రంలో ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్ధుల కోసం ఈ నెల 15 లేదా 16వ తేదీన షెడ్యూల్ విడుదల కానున్నది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో అధికారులు దానికి అనుగుణంగా ఈ షెడ్యూల్ రూపొందిస్తున్నారు. డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్-2020) అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో 2020-21 విద్యాసంవత్సరానికి 2, 3 దశల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనుంది. అలాగే ఈ ప్రక్రియను ఆగస్టు 24 వరకు పూర్తిచేయనున్నారు. ఇక డిగ్రీ మొదటి సంవత్సరం తరగతును యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ ఒకటి నుంచి నిర్వహించాల్సి ఉంది. అలాగే ఆగస్టు ఒకటి నుంచి ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతులను నిర్వహించాల్సి ఉన్నది. దీని కోసం ఇప్పటికే షెడ్యూల్ సిద్ధంచేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ల నిర్వహణకు సీజీజీ సహకారం అందిస్తున్నది. అలాగే వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను విద్యార్థులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కోసం ఉపయోగించనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో విద్యాశాఖ అధికారులు ఇప్పట్లో కళాశాలలను తెరిచేయోచనలో లేదని సమాచారం. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కాలేజీలను ఎప్పటినుంచి ప్రారంభించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుదినిర్ణయం ప్రకటించనున్నది.
సిలబస్ తగ్గించే దిశగా అడుగులు : కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది పరీక్షల సమయం వరకు ప్రస్తుతం ఉన్న సిలబస్ సకాలంలో పూర్తి చేయలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఓ నిర్ణయం తీసుకోనుంది. సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ జయేశ్‌రంజన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు ఇంజనీరింగ్, ఇతర కాలేజీల యాజమాన్యాలతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలు, విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. అంతే కాకుండా కేంద్రం ఉన్నత విద్యలో సిలబస్‌ను, పని దినాలను 50 శాతానికి తగ్గించేందుకు కసరత్తు చేస్తోందని సమాచారం. ఆ మార్గదర్శకాలు ప్రకటించిన తరువాత పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఉన్నత స్థాయి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక కేంద్రం ముందస్తుగానే ఈ మార్గదర్శకాలను అందుబాటులోకి తీసుకువస్తే వాటికి అనుగుణంగా విద్యాసంస్ధలు ముందుకు సాగాలని, లేని పక్షంలో రాష్ట్రంలో ముందుగా ఆన్లైన్లో పాఠాలను సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నారనే సమాచారం. ఆన్ లైన్ తరగతులు జరుగుతున్న సమయంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడితే వాటిని దాన్ని బట్టి ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చారు.ఇక చాలా మంది విద్యార్ధులు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని విద్యార్థులు విదేశీ విద్యకు, ఉద్యోగాల కోసం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఈనెల 20 నుంచి పరీక్షలు నిర్వహించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో కళాశాలలను సెప్టెంబరులో తెరచినప్పటికీ వసతి గృహాలను తెరవకూడదని తెరిస్తే విద్యార్ధులు భౌతిక దూరం పాటించడం కష్టం అవుతుందన్న భావన వ్యక్తమైంది. ఇక రాష్ట్రంలో నిర్వహించనున్న డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబంధించిన అలాగే కాలేజీల ప్రారంభం గురించి ఈనెల 15వ తేదీన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో భేటీ కానున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు