ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ భారత్’ ఉద్యమాన్ని ‘సత్యాగ్రహం నుంచి స్వచ్ఛాగ్రహం’గా అభివర్ణించారు. మహాత్మా గాంధీ చంపారన్‌లో నిర్వహించిన సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తన ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్వచ్ఛ భారత్’ ఉద్యమానికి ఇదొక గొప్ప పండుగ సమయమని తెలిపారు.ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి దాదాపు 20 వేల మంది స్వచ్ఛ భారత్ రాయబారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిని స్వచ్ఛాగ్రహులుగా కూడా పిలుస్తున్నారు. గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణను వీరు ప్రోత్సహిస్తున్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆరోగ్యకర వాతావరణం 50 శాతం కన్నా తక్కువ ఉన్న రాష్ట్రం బిహార్ ఒక్కటే. అయితే ఓ వారం ప్రచారం అనంతరం గొప్ప పురోగతి కనిపించింది.