YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆసక్తి రేపుతున్న కర్ణాటక ఎలక్షన్స్....!!

ఆసక్తి రేపుతున్న కర్ణాటక ఎలక్షన్స్....!!

మే 17న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు దేశమంతటా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికలను శాసించే అవకాశం వుంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలు దేశ రాజకీయంలో కీలకంగా మారుతున్నాయని దీని ఫలితాలు మిగతా రాష్ట్రాల ఎన్నికల మీద కూడా వుంటుందని అంటున్నారు. కర్నాటకలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమ ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించాయి.. ఈరెండు పార్టీలు ఎన్నికలను చాలా కీలకంగా తీసుకుంటున్నాయి. కర్నాటక ఎన్నికలతో పాటుగా ఈ సంవత్సరం చివర్లో ఎన్నికలు జరుపుకుంటున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తిస్‌ఘడ్, మీజోరం మీద కూడా ఈ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.కాంగ్రేస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ అధినేత అమిత్ షా తమ ప్రచారంలో దూసుకుపోతున్నారు. విమర్శ, ప్రతివిమర్శలతో సభాప్రాంగణాలు మారు మోగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గమైన లింగాయత్ ల ఓట్లు రాబట్టేందుకు ఇరు పార్టీలు తమ శాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి. లింగాయత్ ల మద్దతు కోసం సీఎం అభ్యర్ధిగా యడ్యూరప్పను ప్రకటించినప్పటికి లింగాయత్ లకు మైనారిటీ హోదా కల్పించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనతో బీజేపీ ఇరుకున పడింది. లింగాయత్ ల తరువాత అతిపెద్ద వర్గాలైన కురుబలు, దళితులు కాంగ్రెస్ వైపు వుండటం విశేషం. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇక్కడ రెండు రకాలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ లేదా బీజేపీలకు అధిక మెజార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదా హాంగ్ ఏర్పడవచ్చు. హాంగ్ ఏర్పడిన నేపథ్యంలో కర్ణాటకలో మూడవ ప్రధాన పార్టీ అయిన జేడీఎస్ కీలకంగా మారే అవకాశం వుంది. జేడీఎస్ పార్టీ బిఎస్పీ తో జతకట్టి దళితుల ఓట్లు కొల్లగొట్టే పనిలో వుంది. ఈ కూటమికి మెజారిటీ రాకపోయినప్పటికి కాంగ్రెస్, బీజేపీలకు రావాల్సిన ఓట్లు చీల్చి అంతిమంగా ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.కర్ణాటక ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ వర్గాల్లో ఉత్సాహం తగ్గింది. కర్ణాటక ఎన్నికల్లో విజయం తప్పనిసరి కావడంతో పార్టీ కార్యకర్తల మీద ఒత్తిడి పెరిగింది. ఈ ఎన్నికల్లో గెలవడం వల్ల మిగతా రాష్ట్రాల్లోని ఎన్నికలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బీజేపీకి చాలా కీలకం. 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఉత్తరప్రదేశ్. కానీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఏఎస్పీ, బిఎస్పీ కూటమిగా ఏర్పడటంతో విజయాన్ని సాధించడంతో బీజేపీకి పెద్ద దెబ్బే తగిలింది. ఒకవేళ కర్నాటకలో కాంగ్రేస్ గెలుపొందితే ఉత్తరప్రదేశ్ లో ఏఎస్పీ, బిఎస్పీలను కలుకుని పోయే అవకాశం వుంది. ఇలానే జరిగితే ఉత్త్రప్రదేశ్ లో బీజేపీకి గట్టిపోటీ ఎదురవుతుంది. మహారాష్ట్రలో గట్టి బలమున్న శివసేన ఇటీవలే ఎన్డీయే నుంచి బయటకి వచ్చి రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించింది. మోడీ తీసుకుంటున్న నిర్ణయాలను శివసేన అధినేత బహిరంగగానే వ్యతిరేకిస్తున్నాడు. ఒకవేళ కర్నాటకలో బీజేపీ గెలిస్తే శివసేనతో పాటు ఎన్డీయే నుంచి బయటకి రావాలని ఆలోచిస్తున్న పార్టీలన్నీ డిఫెన్స్ లో పడే అవకాశం ఉంది. వీటితో పాటుగా జమ్ముకాశ్మీర్ లో బీజేపీ, పీడిపి మధ్య చీలికలు మొదలయ్యాయి. అక్కడి అత్యవస పరిస్థితుల నేపథ్యంలో బీజేపితో బంధం తెంచుకోవాలని పీడిపి ఆలోచిస్తుంది. ఇదిలా ఉంటే బీహార్‌లో ఎల్జీపీ పార్టీ తన బంధాన్ని బీజేపీతోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటుగా బీజేపీతో జతకట్టాలని చూస్తున్న ఈశాన్య రాష్ట్రాల పార్టీలు కర్ణాటక విజయంతో దగ్గరయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఒక వేళ కర్ణాటకలో కాంగ్రేస్ గెలిస్తే బీజేపితో బంధానికి ఆలోచించే పరిస్థితి వస్తుంది.గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో అమలు చేసిన వ్యూహాల్నే బీజేపీ ఇక్కడ కూడా అమలు చేస్తుంది. సమాచారాన్ని సేకరించడానికి ఇప్పటికే కొంతమదిని నియమించింది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుని దానికి తగ్గట్టు వ్యూహాల్ని రచిస్తోంది. దీనికి పోటీగా కాంగ్రెస్ కూడా పార్టీలన్నింటినీ కలుపుకునిపోయే ప్రక్రియను ప్రారంభించింది. ఇటీవల సోనియాగాంధీ ఇచ్చిన విందుకు 20 పార్టీల నేతలు హాజరయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఈ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కర్నాటకలో విజయం కోసం సిధ్ధరామయ్య నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే లింగాయత్ లను ఆకట్టుకోవడానికి మైనారిటీ హోదా కల్పించాలన్న ప్రతిపాదనను తెర మీదకు తీసుకు వచ్చారు. దీంతో బీజేపీ అండగా ఉన్న లింగాయత్ లు కాంగ్రేస్ వైపు చూస్తున్నారు. రాష్ట్ర జనాబాలో 17 శాతం వున్న లింగాయత్ లు ఎన్నికల విజయంలో కీలకమైన పాత్ర పోషిస్తారు. ముందు నుంచి బీజేపీకి మధ్ధతిస్తూ వచ్చిన లింగాయత్ లు ఇప్పుడు ఆ పార్టీకి దూరమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే నిజమైతే కాంగ్రేస్ ప్రయోగించిన వ్యూహం ఫలించిందనే చెప్పాలి.

Related Posts