మాస్క్ లే శ్రీ రామరక్ష
వాషింగ్టన్ , జూన్ 13,
విధిగా మాస్క్‌లు ధరించడం వల్లే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవచ్చని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. భౌతిక దూరం పాటించడం, హోం క్వారంటైన్ పాటించడం కంటే కరోనా వైరస్ కట్టడిలో మాస్క్‌లే కీలక పాత్ర పోషిస్తాయని అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. పీఎన్ఏఎస్ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుదలకు కారణమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. కరోనా వైరస్‌తో చిగురుటాకులా వణికిపోయిన ఐరోపాలోని ఇటలీలో ఏప్రిల్ 6 నుంచి, అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఏప్రిల్ 17 నుంచి తప్పనిసరిగా మాస్క్ నిబంధనలు అమల్లో రాగా.. అప్పటి నుంచి వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టినట్టు పరిశోధకులు గుర్తించారు.ఈ రక్షణ చర్య ఒక్కటే అంటువ్యాధి సంఖ్యను గణనీయంగా తగ్గించింది.. ఇటలీలో ఏప్రిల్ 6 నుంచి మే 9 వరకు 78,000, న్యూయార్క్ నగరంలో ఏప్రిల్ 17 నుంచి మే 9 వరకు 66,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్ నగరంలో మాస్క్ ధరించడం అనే నిబంధన సత్ఫలితాలను ఇచ్చింది. రోజుకూ సగటున కొత్త కేసులు 3 శాతం మేర తగ్గినట్టు పరిశోధకులు తెలిపారు. అదే, మాస్క్ నిబంధనలు అమెరికా వ్యాప్తంగా అమలు చేయకపోవడంతో వైరస్ తీవ్రత పెరిగిందిఇటలీ, న్యూయార్క్ నగరాల్లో మాస్క్ ధరించే నిబంధనలు అమల్లోకి రాకముందు భౌతిక దూరం, ఐసోలేషన్, చేతులు శుభ్రం చేసుకోవడం అన్నీ అమలులో ఉన్నాయి. కానీ, అవి ప్రత్యక్షంగా వైరస్ ప్రసారాన్ని తగ్గించడానికి మాత్రమే సహాయపడతాయి, అయితే, మాస్క్ మాత్రం గాలి ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుందని పరిశోధకులు వివరించారు.వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి అటామైజేషన్, శానిటైజేషన్ కంటే మాస్క్ ధరించడం వల్ల ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కారణమవుతుందని వివరించారు. పెద్ద సంఖ్యలో సమావేశాల నిర్వహణపై యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శుక్రవారం కీలక సూచనలు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి మాస్క్ తప్పనిసరిగా వాడాలని సూచించింది.