బ్రహ్మానుభూతి.....
బ్రహ్మానుభూతి లేదా.. ఆత్మానుభూతి లేదా.. నేను బ్రహ్మమును అని అనుభవపూర్వకంగా తెలుసుకోవటమే అన్నింటికన్న ముఖ్యమైనదని, కష్టసాధ్యమైనదని, ఎన్నో మెట్లు ఎక్కి చేరుకోవాల్సినదని చెబుతున్నారు. అంతటి అదృష్టం కలగాలంటే ఎన్నో కోట్ల జన్మల సుకృతాలుండాలి.
ముఖ్యంగా ప్రాణికోట్లన్నింటి లోనూ మానవ జన్మయే శ్రేష్ఠం. ఉత్తమోత్తమం. శరీరం, మనస్సు, బుద్ధి మూడూ ఉన్న జన్మ ఇది.
రాళ్ళురప్పల్లో చైతన్యం ఉన్నా వ్యక్తం కాదు. చెట్లలో వ్యక్తమవుతుందేగాని ఏ అనుభవాలు పొందలేవు. జంతువుల్లో అనుభవాలు పొందే శక్తి ఉంటుందే గాని గ్రహించగల బుద్ధి వుండదు. ఒక్క మానవుడికే గ్రహించగల బుద్ధి ఉన్నది. తార్కికంగా ఆలోచించే నేర్పు ఉన్నది. తన అంతరంగాన్ని తెలుసుకోగలడు, నియమించ గలడు, శాస్త్రాలను అర్థం చేసుకో గలడు, అనుకున్నవి సాధించగలడు. తన నిజస్వరూపాన్ని తెలుసుకొని పరమ శాంతిని పొందగలడు. అందుకే మానవజన్మ దుర్లభం.
దుర్లభమైన దానిని ఎంత జాగ్రత్తగా చూచుకోవాలి.. అందరు అలా చూసుకోగలరా.. లేదు. మానవజన్మ వచ్చినా జంతువు లాగా తిని, త్రాగి, నిదురపోయి, సంతానాన్ని కని.. అదే పరమార్థమనుకొని జీవించే వాళ్ళు ఉన్నారు. మానవుడి లాగా తోటి మానవునికి సాయపడుతూ ఉన్నత ఆదర్శంతో జీవించేవారూ ఉన్నారు. కానీ పరమ లక్ష్యమైన మోక్షానందాన్ని పొందటానికి అది చాలదు...
|| ఓం నమః శివాయ ||