YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటెల నెత్తిన పాలుపోసిన రేవంత్

ఈటెల నెత్తిన పాలుపోసిన రేవంత్

ఈటెల నెత్తిన పాలుపోసిన రేవంత్
హైద్రాబాద్, జూన్ 15,
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌ను మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించ‌బోతున్నార‌నే ప్ర‌చారం త‌ర‌చూ జ‌రుగుతోంది. ఏడాది క్రితం మొద‌టిసారిగా ఈ ప్ర‌చారం ప్రారంభ‌మైంది. అయితే, అటువంటి క‌ఠిన నిర్ణయాలు ఏవీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకోక‌పోవ‌డంతో ఆయ‌న మంత్రివ‌ర్గంలో కొన‌సాగుతున్నారు. తాజాగా ఇప్పుడు క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఈటెల రాజేంద‌ర్‌ను బాధ్యుడిని చేస్తూ ఆయ‌న‌ను మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించాల‌ని కేసీఆర్ ఆలోచిస్తున్నార‌ని, వ‌చ్చె వారంలోనే ఈటెల మంత్రి ప‌ద‌వి పోతుంద‌ని కాంగ్రెస్ నేత‌, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.నిజానికి ఈటెల రాజేంద‌ర్ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు, ఆత్మీయుడు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే న‌డిచిన నేత‌. పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు టీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా శాస‌న‌స‌భ‌లో సీమాంధ్ర ఎమ్మెల్యేల‌ను, పార్టీల‌ను ధీటుగా ఎదుర్కున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా ప‌ని చేసిన వ్య‌క్తి. టీఆర్ఎస్ ముఖ్య నేత‌ల్లో ఒక‌రిగా ఈటెల రాజేంద‌ర్‌కు పేరుంది. టీఆర్ఎస్‌లో, కేసీఆర్ మ‌దిలో అంత‌టి కీల‌క స్థానంలో ఉన్న ఈటెల రాజేంద‌ర్‌పైన కేసీఆర్‌కు అసంతృప్తి ఉంద‌ని సుమారు ఏడాది క్రితం ప్రచారం ప్రారంభ‌మైంది.రెండోసారి గెలిచాక మొద‌టి విడ‌త‌లోనే ఈటెల‌కు కేసీఆర్ మంత్రిప‌ద‌వి ఇచ్చారు. కానీ, మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు కొన్ని రోజుల ముందు రెండు ప‌త్రిక‌ల్లో ఈటెల రాజేంద‌ర్‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈటెల ప‌ట్ల కేసీఆర్ అసంతృప్తితో ఉన్నార‌ని, ఆయ‌న‌ను మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించ‌వ‌చ్చు అనేది ఈ క‌థ‌నాల సారాంశం. అయితే, ఆయ‌న‌ను మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించాల‌ని ఎవ‌రో కావాల‌నే ఈ క‌థ‌నాల‌ను రాయించార‌నే ప్ర‌చారం అప్ప‌ట్లో పెద్ద ఎత్తున జ‌రిగింది. ఈటెల కూడా ఒక ద‌శ‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గులాబీ జెండాకు తాము ఓన‌ర్లం అంటూ ఆయ‌న సీరియ‌స్ కామెంట్స్ చేశారు.ఈటెల త‌న ఆవేద‌న వెల్ల‌గ‌క్క‌గానే ఆయ‌న‌కు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు వ‌చ్చింది. అనూహ్యంగా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ ఈటెల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడింది. ఉద్య‌మకారుడైన ఈటెల‌ను కేసీఆర్ ప‌క్క‌న‌పెడుతున్నార‌ని వీహెచ్ వంటి నేత‌లు ఆరోపించారు. బీసీల్లో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న ఈటెల‌కు బీసీ సంఘాల‌న్నీ మ‌ద్ద‌తు తెలిపాయి. ఈటెల‌కు తామంతా అండ‌గా ఉంటామ‌ని ప్ర‌కట‌న‌లు ఇచ్చాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన కేసీఆర్ ఈటెల‌తో మాట్లాడి అంతా సెట్ చేసేశారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ ఈటెల రాజేంద‌ర్‌కు మ‌ళ్లీ స్థానం ద‌క్కింది. దీంతో ఆయ‌న క్యాబినెట్‌లో కొన‌సాగుతున్నారు.ఇప్పుడు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో మ‌రోసారి ఈటెల రాజేంద‌ర్‌ను త‌ప్పిస్తార‌నే ప్ర‌చారానికి రేవంత్ రెడ్డి తెర‌తీశారు. క‌రోనా కేసులు పెరిగిపోతే వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల‌ను మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించాల‌ని కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నేది రేవంత్‌రెడ్డి చెప్పిన జోస్యం. రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్ర‌కట‌న తెలంగాణ స‌మాజంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. ఈటెల రాజేంద‌ర్‌ వ్య‌క్తిగ‌తంగా, రాజ‌కీయంగా మ‌చ్చ లేని క్లీన్ ఇమేజ్ ఉన్న నేత‌. బీసీ నాయ‌కుడు. ఉద్య‌మ‌కారుడు. స‌హ‌జంగానే ఇటువంటి నేత ప‌ట్ల ప్ర‌జ‌ల్లోనూ సానుభూతి ఉంటుంది.ఈటెల‌ను మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించే కుట్ర జ‌రుగుతుంది అని రేవంత్ చెప్ప‌డంతో ఒక అనుమానం ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. ప్ర‌జ‌ల్లో ఈ అనుమానాలు ఉన్న నేప‌థ్యంలో ఈ స‌మ‌యంలో ఈటెల‌ను త‌ప్పిస్తే నిజంగానే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కుట్ర జ‌రిగిందేమో అనే వాద‌న బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది. పైగా క‌రోనా వైర‌స్ వంటి విప‌త్తు ఎదుర్కోవ‌డంలో విఫ‌ల‌మైతే అది కేవ‌లం ఒక్క వైద్యారోగ్య శాఖ మంత్రి వైఫ‌ల్యం మాత్ర‌మే కాదు. మొత్తం ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది.కాబ‌ట్టి, ఈటెల‌ను ఒక్క‌డిని బాధ్యుడిని చేయ‌డం కూడా ఎవ‌రూ స్వాగ‌తించే అవ‌కాశం ఉండ‌దు. అయితే, మంత్రివ‌ర్గ విస్త‌రణ జ‌రిపి ఈటెల‌ను త‌ప్పిస్తే ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ, ఆయ‌న ఒక్క‌డినే ఇప్పుడు త‌ప్పిస్తే మాత్రం టీఆర్ఎస్‌కు ఇబ్బంది క‌లిగే అవ‌కాశం ఉంది. అందునా ఈటెల‌పై కుట్ర జ‌రుగుతుంద‌ని రేవంత్ రెడ్డి చెప్పాక, ఈ అనుమానం ప్ర‌జ‌ల్లో ఏర్పడ్డాక ఈటెల‌ను తొల‌గించడం రాజ‌కీయంగా సాహ‌స‌మే అవుతుంది. అంత ప‌ని కేసీఆర్ చేసే అవ‌కాశ‌మే లేదు. ఒక‌వేళ ఈటెల‌ను నిజంగానే తొల‌గించే ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌ట్ల‌యితే రేవంత్ రెడ్డి ప‌రోక్షంగా ఈటెల‌కు మేలు చేసిన‌ట్లే అవుతుంది.

Related Posts