YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అందుబాటులోకి చైనా వ్యాక్సిన్..?

అందుబాటులోకి చైనా వ్యాక్సిన్..?

అందుబాటులోకి చైనా వ్యాక్సిన్..?
బీజింగ్, జూన్ 15,
ప్రాణాంతక కరోనా వైరస్‌‌తో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోంది. మహమ్మారికి ఎప్పుడు ఎలా అడ్డుకట్ట పడుతోందో తెలియక అగ్రరాజ్యాల నుంచి పేద దేశాల వరకు సతమతమవుతున్నాయి.ప్రాణాంతక కొత్తరకం కరోనా వైరస్‌కు వ్యాక్సిన్, చికిత్స విధానం గురించి ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. కొన్ని టీకాలు క్లినికల్ దశకు చేరుకుని ఆశలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా, తాము అభివృద్ధి చేసిన టీకాను మానవులపై ప్రయోగించినప్పుడు సత్ఫలితాలు వచ్చినట్టు చైనా పరిశోధకులు తెలిపారు. తాము రూపొందించిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ రెండు దశల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చినట్టు చైనాకు చెందిన సైనోవ్యాక్ బయోటెక్ వెల్లడించింది. ‘కరోనావ్యాక్’ పేరుతో రూపొందించిన ఈ టీకాను.. 18 నుంచి 59 ఏళ్లలోపు మధ్య ఉన్న 743 మంది వలంటీర్లపై ప్రయోగించినట్టు తెలిపింది.తొలిదశలో 143 మంది, రెండో దశలో 600 మంది పాల్గొన్నట్టు సైనోవ్యాక్ ప్రకటించింది. రెండు వారాల వ్యవధిలో రెండుసార్లు టీకాను ఇచ్చి, 14 రోజుల తర్వాత పరీక్షించామని, వీరిలో 90 శాతం కంటే ఎక్కువ మందిలో తటస్థీకరించే ప్రతిరోధకాలను ప్రేరేపించిందని పేర్కొంది. అంతేకాదు, తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా చూపలేదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రెండో దశ క్లినికల్ స్టడీ రిపోర్టు సహా మూడో దశ ప్రోటోకాల్‌ను నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌కు త్వరలోనే సమర్పించినుంది. మూడో దశలో చైనా వెలుపల ప్రయోగాలు నిర్వహించనున్నారు. మూడో దశ ప్రయోగంలో బ్రెజిల్‌లోని ఇన్‌స్టిట్యూటో బుటాంటన్‌తో కలిసి సినోవ్యాక్ పనిచేయనుంది. క్లినికల్ ట్రయల్స్ పూర్తి సమాచారాన్ని ప్రజలతో పంచుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. తొలి రెండు దశల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతమయ్యాయని, ఎలాంటి దుష్ప్రభావాలు చూపలేదని సినోవ్యాక్ ఛైర్మన్, వీడాంగ్ యిన్ అన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించినట్టు తెలిపారు. ఫేజ్ 1,2లో ప్రోత్సాహకరమైన ఫలితాలతో కోవిడ్ -19పై పోరాటంలో తాము సాధించిన మరో ముఖ్యమైన మైలురాయి అని వీడాంగ్ చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించామని, తద్వారా కోవిడ్ -19 నుంచి ప్రజలను రక్షించడానికి అందుబాటులో ఉన్న మోతాదుల సంఖ్యను పెంచవచ్చన్నారు. మా ఇతర వ్యాధులకు మాదిరిగానే, కరోనాకు వ్యాక్సిన్ సరఫరా చేయాలనే మా మిషన్‌లో భాగంగా ప్రపంచానికి ఉపయోగం కోసం కరోనావాక్‌ను అభివృద్ధి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియను చైనాలోని ప్రముఖ విద్యా పరిశోధన సంస్థతో కలిసి సైనోవ్యాక్ జనవరిలోనే ప్రారంభించింది. దీనికి సంబంధించిన అనుమతులను ఏప్రిల్ 13న లభించడంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ మొదలుపెట్టింది. ప్రపంచంలో 25కిపైగా సంస్థలు వ్యాక్సిన్ తయారీలో కీలక పురోగతి సాధించాయి.

Related Posts