తప్పుడు వీడియోను ప్రసారం చేసినందుకు దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు
భోపాల్ జూన్ 15
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌పై తప్పుడు వీడియోను, ఎడిట్ చేసిన వీడియోను ప్రసారం చేసినందుకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పై భోపాల్ క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మద్యం పాలసీపై శివరాజ్ సింగ్ చౌహాన్ జనవరిలో విమర్శలు గుప్పించారు. అయితే అందులోని పూర్తి ప్రసంగ పాఠాన్ని కాకుండా, అందులోని కొద్ది భాగాన్ని డిగ్గీరాజా ఎడిట్ చేసి ప్రసారం చేశారు. ఈ వీడియో ఆదివారం డిగ్గీరాజా అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు. దాన్ని మరో పది మంది షేర్ చేశారు. దీంతో బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ హోంమంత్రి ఉమాశంకర్ గుప్తా నేతృత్వంలోని కొద్ది మంది నేతలు ఈ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డిగ్గీ రాజాతో పాటు మరో పది మందిపై ఐపీసీ 500,501 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డిగ్గీ రాజాను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఈ దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.