గురువు చెప్పాలి .. శిష్యుడు వినాలి..
వినసొంపుగా చెప్పేవాళ్లుంటే సరిపోదు, శ్రద్ధగా వినేవాళ్లూ ఉండాలి. సావధానంగా చెవులు రిక్కించి వినేవాళ్లుంటే కుదరదు... విషయాన్ని ఓపిగ్గా విడమరచి చెప్పేవాళ్లుండాలి. గురు శిష్య పరంపర కొనసాగుతుండటానికి ముఖ్యకారణం- 'గురువు చెప్పడం, శిష్యుడు వినడమే'.
ఆధ్యాత్మిక జీవన వికాసంలో ప్రస్తావించే శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. మోక్షం అనే భగవద్ సాక్షాత్కారం పొందడానికి శ్రవణమే నాంది అన్నది మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. శ్రీమద్భాగవతాంతర్గతంగా చెప్పిన నవ విధ భక్తిమార్గాల్లోనూ శ్రవణానిది మొదటి స్థానమని గుర్తించాలి.
మనిషి జీవన ప్రయాణంలో సమయానికి నాలుగు మంచి ముక్కలు చెప్పగలిగేవాళ్లు దొరకడం పూర్వజన్మ సుకృతం. చెవులకు రెప్పలు లేవు కాబట్టి, సమస్త మాటల ప్రవాహం మనసులోకి అలవోకగా ప్రవహిస్తుంది. హృదయాన్ని జల్లెడ చేసుకుని మంచిని గ్రహించి, చెడును విసర్జిస్తే లోకాస్సమస్తా సుఖినో భవంతు అన్న భావానికి అంకురారోపణ జరుగుతుంది.
వేదాలను రుషులు భగవంతుడి ద్వారా విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అంటారు. ఆనాటి రుషులు అంతటి ఏకాసంథాగ్రాహులు కావడం వల్లే ఒక్క అక్షరం పొల్లుపోకుండా ఆ జ్ఞాన సంపద మన వరకు చేరింది. అది సంప్రదాయ రీతులు ఏర్పరచి మనుషులు కట్టు తప్పకుండా చూసుకుంటోంది.
వినడం అన్నది అంత తేలికైన విషయం కాదు. మనసును పరిపరి విధాల ఆలోచనలపైకి జారుకోనీయకుండా పట్టుకుని, వినబోయే విషయం మీద పెడితే అప్పుడు ఎదుటి మనసులోది మన వశమవుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు పిల్లలందరికీ ఒక్కసారే విపులంగా పాఠం చెప్పినా, ఒక్కొక్కరూ ఒక్కో రకంగా అర్థం చేసుకుని, వారికి తోచిన విధంగా పరీక్షల్లో రాయడమే మార్కుల తారతమ్యానికి కారణం.
గురువు వందలమందికి ప్రవచనం చెప్పినా, కొంతమంది కేవలం అక్కడ కూర్చుంటారు, వాళ్ల మనసు అన్ని వైపులకు పరుగులు తీస్తుంటుంది. మరి కొంతమంది వింటారు కాని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. ఇంకొంతమంది ఆ కార్యక్రమానంతరం చేయవలసినదాని గురించి మనసులో ప్రణాళికలు రచిస్తుంటారు. ఒకరో ఇద్దరో మాత్రమే శ్రద్ధగా విని, ఆకళింపు చేసుకుని, ఇంకా అర్థంకానిది ఏమైనా ఉంటే గురువుగారిని అడిగి సందేహాలు తీర్చుకుంటారు. సంతృప్తిగా ఇళ్లకు చేరుకుంటారు.
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ...!
తాత్పర్యం :-
లోకంలో ఎవ్వరు ఏమి చెప్పినా ఓపికగా వినేవాడే ఉత్తముడు. ఏదేని విషయాన్ని విన్న వెంటనే తొందరపడి మాట్లాడకుండా... అందులో నిజా నిజాలను తెలుసుకునేవాడే ఈ భూప్రపంచంలో నీతిపరుడుగా నిలుస్తాడని ఈ పద్యం యొక్క భావం.
వినదగునెవ్వరు చెప్పిన అన్నది ఒక పద్యకారుడు చెప్పిన అతి విలువైన పదాల పొందిక. చెప్పేవన్నీ ఉచిత సలహాలు అని తేలిగ్గా తీసేయడం తగదు. ఎవరు చెప్పే మాటలు మనకు దిశానిర్దేశం చేస్తాయో, కష్టనష్టాల నుంచి బయటపడేస్తాయో ఎవరికీ తెలియదు. అందరు చెప్పేదీ వినాలి, తార్కికంగా ఆలోచించి ఆచరించాలి. నాకంతా తెలుసు ఇక వినవలసింది ఏమీ లేదు అనుకోవడం- పతనావస్థకు చేర్చే దారిపట్టడమే.
చెప్పేవాళ్లు లేక చెడిపోయాడు అన్నది నానుడి. ఈ లోకంలో మన గురించి ఆలోచించి, సుభాషితాలు చెప్పి, సరైన బాటలో నడిపించేవాళ్లు లభించడం అరుదు. మాటలు శ్రవణపేయంగా ఉండవలసిన అవసరం లేదు. అవి కఠినంగా ఉన్నా బతుకును తీర్చిదిద్దేవిగా ఉండాలి.
విశ్వామిత్రుడు, యాగ సంరక్షణార్థం శ్రీరాముణ్ని తనతో అడవికి పంపమని దశరథుణ్ని కోరినప్పుడు, ఆయన పసివాణ్ని పంపడానికి ఇష్టపడడు. విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై కఠినంగా, పంపితీరాల్సిందేనంటాడు. అందులోని యథార్థాన్ని గ్రహించింది ఒక్క వసిష్ఠుడే. ఆయన దశరథుడికి నచ్చజెప్పి విశ్వామిత్రుడితో శ్రీరామచంద్రుణ్ని కానలకు పంపి ఉండకపోతే- రామయ్య ఉత్తమత్వం లోకానికి ప్రకటితమయ్యేది కాదు. రాముడి బాట మనకు రాచబాట అయ్యేదీ కాదు!
సనాతన ధర్మస్య రక్షిత రక్షితః