*వనపారిజాతం*
అలవైకుంఠపురంలో శ్రీమహావిష్ణువు సిగనలంకరించిన దివ్యపారిజాతం ఎంత చరితార్థమో, ఎక్కడో ఒక అడవిలో తపోనిమగ్నుడైన మహర్షి పాదాలమీద పడి వాడిపోయే అడవిమల్లె జీవితమూ అంతే చరితార్థం. అన్ని పూలూ దివ్యపారిజాతాలే కానక్కర్లేదు. మహాత్ముల దృష్టిలో రెండూ సమానమే.
రామాయణంలో శబరి ఒక అడవి మల్లె. అడవిలో పుట్టి అడవిలోనే రాలిపోయింది. ఆమె అంతరంగం భక్తిభావంతో పరిమళించింది. ఆమె జీవితం మహర్షుల సేవకు అంకితమైంది. శబరి సిద్ధ తపస్విని. ఆమె బతుకంతా మతంగాశ్రమ పరిచర్యలోనే గడిపింది. మతంగ మహర్షి, ఆయన శిష్యులు ఒక్కొక్కరే సిద్ధిపొందారు. శబరి ఒంటరిగా మిగిలి ఉంది. ఆమె ఎవరికోసమో నిరీక్షిస్తోంది. కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. మతంగ మహర్షి శిష్యులైన మునులు ఆమెను చూడటానికి శ్రీరామచంద్రుడు వస్తాడని, ఆమె సత్కారాలు స్వీకరిస్తాడని, ఆ పుణ్యపురుషుడి దర్శనంతో ఆమె పునర్జన్మ లేని లోకాలకు చేరుకుంటుందని చెప్పారు.
శబరి శ్రీరాముడి ఆతిథ్యానికి అన్నీ సిద్ధం చేసింది. చెట్టు చెట్టుకు ఒక మేలిమి పండు ఏరి తెచ్చింది. ప్రతి చెట్టు పండును రుచి చూసింది. మధురంగా ఉన్నవాటితో, బాగా పండినవాటితో గంప నింపింది. సెలయేటి నీటిని దొప్పల్లో నింపి ఉంచింది. పాదపూజ కోసం రకరకాల పూలు కోసింది. ఒకరోజు ఉదయం ఏదో తెలియని ఆనందం శబరి హృదయాన్ని బలంగా అలముకుంది. ఆమె కళ్లల్లో కొత్త కాంతి తొణికిసలాడింది. నీలమేఘశ్యాముడు రాముడు ఆమె వాకిట నిలిచాడు. నీడలా లక్ష్మణుడు అన్న వెన్నంటి ఉన్నాడు. శబరి చేతులు జోడించింది. రాముడికి పాదాభివందనం చేసింది. అర్ఘ్యపాద్యాలిచ్చింది. రాముడామె పారవశ్యాన్ని చూశాడు. చిరునవ్వుతో పలకరించాడు. అతడి హస్తస్పర్శతో ఆ యోగిని మేను అనిర్వచనీయమైన అనుభూతిని పొందింది.
ఆమె తపస్సు నిర్విఘ్నంగా సాగుతోందా అని ప్రశ్నించాడు రాముడు. గురు శుశ్రూష ఫలించిందా అని కూడా అడిగాడు. రామ దర్శనంతో తన తపస్సు ఫలించిందని, గురుసేవాఫలం పొందబోతున్నానని బదులిచ్చింది శబరి. చర్మచక్షువులతో రాముణ్ని దర్శించడం కంటే తనకేం కావాలంది. రామానుగ్రహంతో అక్షయ లోకాలూ పొందగలనంది. తాను సేకరించిన మధుర ఫలాలను రాముడి నోటికందించింది. లక్ష్మణుడి చేతికిచ్చింది. సోదరులిద్దరూ సంతుష్టులయ్యారు. శబరి వారికి మహర్షుల యజ్ఞవేదికలు చూపించింది. మహర్షులు తమ తపశ్శక్తిచే సప్త సముద్రాల జలాలను ఆశ్రమానికి తెప్పించుకున్న సంగతి చెప్పింది. తనకు సెలవిప్పించమంది. రామచంద్రుడి సమక్షంలో తనువును విడిచిపెడతానంది. రాముడు ఆనందంగా తల ఊపాడు. యోగాగ్నిలో ఆమె దేహం భస్మమైంది. కోటి విద్యుత్తుల కాంతి అంతరిక్షంలోకి లేచి వెళ్లింది.
శ్రీరాముడికి ఎందరో గొప్ప భక్తులున్నారు. వారు రాముడికి సహాయం చేశారు కూడా. శబరి రాముడికి చేసిందేమీ లేదు. కాని ఆమెను చూడగానే రాముడి హృదయం పరమ ప్రసన్నతాభావం పొందిందని, సీతావియోగంవల్ల స్తబ్ధమై జడమైన భావాన్ని శబరి మేల్కొల్పిందని విజ్ఞులైన విమర్శకులు చెబుతారు.
రామాయణం అరణ్యకాండకు వెలుగునిచ్చే పాత్ర శబరి. ఎందరో కవుల కలాలను పండించిన భక్తశబరి కథ విశ్వనాథ లేఖినిలో వినూత్నంగా ప్రకాశించింది. శబరీ రామచంద్రుల చమత్కార సంభాషణను చిత్రించారు కల్పవృక్ష కవి. శబరి భావాలు సాత్వికం. సత్వగుణం తెలుపు. ఆమె ఎండి ఏకైపోయిందని రాముడంటే ఆ ఏకును స్నేహం(చమురు)తో తడిపి దివ్వెగా వెలిగించమని ప్రార్థించింది శబరి. శరీర భ్రాంతి ఎండి ఏకత్వసిద్ధి కలిగేంతవరకు భగవంతుడికోసం తపించాలి. ఆమె తల ముగ్గుబుట్టయిందని రాముడు చమత్కరిస్తే రాముడి ఆత్మ వాకిట రంగవల్లులు తీర్చడానికని చెప్పిందామె. విశ్వనాథవారి శబరి ఒక యోగిని. ఆత్మతత్వం ఎరిగిన ప్రాణి. శబరిని అర్థం చేసుకోవడానికి మేధ చాలదు. భావుకత్వం సాధనమవాలి.