YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టెస్టులపై గురి పెట్టిన తెలంగాణ

టెస్టులపై గురి పెట్టిన తెలంగాణ

టెస్టులపై గురి పెట్టిన తెలంగాణ
హైద్రాబాద్, జూన్ 16, 
క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల విష‌యంలో ఏ రాష్ట్రం ఎదుర్కోన‌న్ని విమ‌ర్శ‌లల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఎదుర్కుంటోంది. క‌రోనా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఎందుకో తెలంగాణ ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేస్తోంది. ప‌క్క రాష్ట్రాలు ప్ర‌తీ రోజే వేల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే తెలంగాణ‌లో మాత్రం వంద‌ల్లోనే ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలు ఎక్కువ ప‌రీక్ష‌లు చేసినా ఇక్క‌డ మాత్రం టెస్టుల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంది. టెస్టుల నిర్వ‌హ‌ణ‌లో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల‌తో పోల్చితే అట్ట‌డుగులు స్థానాల్లో ఉంటోంది. ఐసీఎంఆర్ నిబంధ‌న‌ల మేర‌కే తాము టెస్టులు చేస్తున్నామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతున్నా టెస్టుల విష‌యంలో ప్ర‌భుత్వ వైఖ‌రి ప‌ట్ల అంత‌టా అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ నేరుగా తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనా టెస్టులు చేయ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. కేంద్రం ప‌లుమార్లు ఇవే వ్యాఖ్య‌లు చేసింది. హైకోర్టు అనేక‌సార్లు క‌రోనా ప‌రీక్ష‌లు ఎక్కువ చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ప్ర‌తిప‌క్షాలు ప‌దేప‌దే ప‌రీక్ష‌లు ఎక్కువ‌గా చేయాల‌ని కోరుతున్నాయి. ప్ర‌జ‌లు సైతం ప్ర‌భుత్వం ఎందుకు క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలా ఎన్ని వైపుల నుంచి క‌రోనా ప‌రీక్ష‌ల విష‌యంలో ఒత్తిడి వ‌చ్చినా తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం ఇంత‌కాలం స్పందించ‌లేదు. హైకోర్టు మొట్టికాయ‌లు వేసినా, కోర్టు దిక్క‌ర‌ణ అవుతుంద‌ని హెచ్చ‌రించినా ప‌ట్టించుకోలేదు.ఐసీఎంఆర్ నిబంధ‌న‌లే మేర‌కు తాము క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని, ప్ర‌తిప‌క్షాలు కావాల‌నే బుర‌ద‌జ‌ల్లుతున్నాయ‌ని ప్ర‌భుత్వం వాదిస్తూ వ‌చ్చింది. మ‌రోవైపు ల‌క్ష‌ణాలు లేని వారికి, సెంక‌డ‌రీ కాంటాక్ట్‌ల‌కు కూడా ప‌రీక్ష‌ల‌ను ప్ర‌భుత్వం చాలా రోజుల నుంచి నిలిపేసింది. ఈ విష‌యంలోనూ ప్ర‌భుత్వ వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. టెస్టులు త‌క్కువ‌గా చేసి కేసుల సంఖ్య‌ను కూడా త‌క్కువ‌గా చూపించే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శించాయి. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కు ప‌ట్టించుకోలేదు.కానీ, ప‌రిస్థితి రోజురోజుకూ అదుపుత‌ప్పుతోంది. హైద‌రాబాద్‌, చుట్టు ప‌క్క‌ల జిల్లాల్లో పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నెల క్రితం రోజుకు 2, 3 కేసులు న‌మోద‌వుతున్న‌ట్లుగా చూపించ‌గా ఇప్పుడు ప్ర‌తి రోజు సుమారు 200 కేసులు న‌మోద‌వుతున్న‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి.ముగ్గురు ఎమ్మెల్యేల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. ఇద్ద‌రు మంత్రులు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో క‌రోనా తీవ్రత ఊహిస్తున్న దాని కంటే, చెబుతున్న దాని కంటే ఎక్కువ‌గా ఉండి ఉంటుంద‌నే భ‌యాలు పెరుగుతున్నాయి. నిజానికి ఐసీఎంఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే తెలంగాణ ప్ర‌భుత్వం టెస్టులు చేస్తూ ఉండొచ్చు. కానీ, ట్రేసింగ్ - టెస్టింగ్ - ట్రీట్‌మెంట్ అనే విధానం క‌రోనా క‌ట్ట‌డికి త‌ప్ప‌నిస‌రి అని అంత‌ర్జాతీయంగా నిపుణులు చెబుతున్నారు.అందుకే అన్ని రాష్ట్రాలూ పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్నాయి. ప‌క్క రాష్ట్రాల్లో ల‌క్ష‌ల సంఖ్య‌లో టెస్టులు జ‌ర‌గ‌గా తెలంగాణ‌లో ఇంకా యాభై వైల లోపే టెస్టులు జ‌రిగాయి. ఈ వివ‌రాలు కూడా ప్ర‌భుత్వం బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. ఒక‌వైపు టెస్టుల విష‌యంలో విమ‌ర్శ‌లు పెర‌గ‌డం, క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉండ‌టంతో ప్ర‌భుత్వం ఇప్ప‌టికి మ‌న‌స్సు మార్చుకుంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో వారం, ప‌ది రోజుల్లో 50 వేల టెస్టులు చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. అంతేకాదు, ప్రైవేటు ల్యాబుల్లోనూ టెస్టులు జ‌రిపేందుకు అనుమ‌తించి, ధ‌ర‌లు నిర్ధారించాల‌ని నిర్ణ‌యించారు.ఇలా క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో టెస్టులు ఎక్కువ‌గా చేయ‌డం, ప్రైవేటు ల్యాబుల్లోనూ ప‌రీక్ష‌లు చేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌డం మిగ‌తా రాష్ట్రాలు ఇప్ప‌టికే చేశాయి. ఎట్ట‌కేల‌కు తెలంగాణ కూడా ఇప్పుడు మ‌న‌స్సు మార్చుకొని ఎక్కువ టెస్టులు చేయాల‌ని నిర్ణ‌యించింది. తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ తీవ్రత ఎలా ఉందనేది పెద్ద ఎత్తున టెస్టులు చేయ‌డం ద్వారానే తేల‌నుంది.

Related Posts