ఏపీలో రాజ్యసభ వార్....
విజయవాడ, జూన్ 16
19వ తేదీ అంటేనే తెలుగుదేశం పార్టీకి దడ పుట్టిస్తోంది. ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది. అయితే నలుగురు సభ్యులు బరిలో ఉండటంతో ఎన్నిక అనివార్యమయింది. టీడీపీ తరుపున వర్ల రామయ్య రాజ్యసభ సభ్యుడిగా బరిలో ఉన్నారు. దీంతో రాజ్యసభ ఎన్నికలకు ముందే మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.ఇందుకు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. ఈనెల 19వ తేదీన టీడీపీ బలం ఏంటో తెలిసిపోతుందన్న విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ప్రకంపనలు రేపుతుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు పలికారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం వంటి నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. అనధికారికంగా పార్టీలో వాళ్లు లేనట్లే. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వీరికి ప్రత్యేక స్థానాలను కేటాయించే అవకాశముంది.మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశముందదని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మంత్రులు ఇదే పనిలో ఉన్నారని చెబుతున్నారు. నిజానికి మహానాడుకు ముందే కొందరు ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారన్న ప్రచారం జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఏలూరి సాంబశివరావు, గుంటూరు జిల్లాకు చెందిన అనగాని సత్యప్రసాద్ లు పార్టీని వీడతారన్న ప్రచారం జరిగింది. అయితే తాము పార్టీని వీడేది లేదని వారు ప్రకటించడంతో టీడీపీ అధినేత కొంత ఊపిరి పీల్చుకున్నట్లయింది.కానీ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల సందర్బంగా మరికొందరు ఎమ్మెల్యేలను తమ వైపునకు రప్పించుకోవాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలతో వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా అసెంబ్లీ సమావేశాలకు ముందే పోతుందన్న ప్రచారం వైసీపీలో జోరుగా జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.