అగ్రిగోల్డ్, ఈఎస్ఐ ఫైళ్ల తవ్వకాలు
విజయవాడ, జూన్ 16,
అమరావతి భూ కొనుగోళ్లుపై ఈడీ ఫోకస్ పెట్టింది. గత మూడు నెలల నుంచి ప్రాథమిక విచారణ జరిపిన ఈడీ.. ఇప్పుడు నేరుగా క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించింది. ప్రధానంగా ఆదాయ వనరులు లేని వాళ్ళు కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతిలో భూములు ఎలా కొనుగోలు చేశారో ఆరా తీసింది. అలాగే తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ కూడా పెద్ద ఎత్తున భూములు ఎలా కొనుగోలు చేశారనే అంశాలపై ఫోకస్ పెట్టింది. ల్యాండ్ పూలింగ్‌లో రిటర్నబుల్ ప్లాట్లు దక్కించుకున్నది ఎవరు? వాటిని ఎవరికి విక్రయించారు? వంటి వివరాలపై సీఐడీతోపాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సీఆర్‌డీఏ అధికారులతో నాగార్జున యూనివర్సిటీలో సుదీర్ఘంగా చర్చించారు.తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 700 మంది తెల్లకార్డుదారులు అమరావతి ప్రాంతంలో రూ.కోట్లతో భూములు కొనుగోలు చేశారని రాష్ట్ర సీఐడీ ఇప్పటికే తేల్చింది. దీనికి సంబంధించి ఏపీ సీఐడీ తంలో ఈడీకి లేఖ రాసింది. దీంతో రికార్డులను పరిశీలించేందుకు ఈడీ అధికారులు వచ్చారు. ఈడీ అధికారులు భూ కొనుగోళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించారు.అమరావతి భూ కొనుగోళ్లు మాత్రమే కాదు అగ్రిగోల్డ్ స్కామ్‌కు సంబంధించిన వివరాలపై కూడా ఈసీ ఆరా తీసింది. అలాగే ఈ మధ్య సంచలనం రేపిన ఈఎస్‌ఐ కుంభకోణంపై ఏసీబీ అధికారుల దగ్గరున్న ఫైళ్లన్నీ తెప్పించుకుని పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో కేంద్రం నిధులు అధికంగా ఉండటంతో ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి అమరావతికి వచ్చిన అధికారులు 4 బృందాలుగా ఏర్పడి భూముల కొనుగోలు, అగ్రిగోల్డ్, ఈఎ్‌సఐకి సంబంధించిన ఫైళ్లు పరిశీలించినట్లు తెలుస్తోంది.