.లడఖ్‌లో చైనా, భారత బలగాల మధ్య ఘర్షణ.. ఇద్దరు సైనికులు మృతి
న్యూ ఢిల్లీ జూన్ 16
లడఖ్ లోని గాల్వన్ వ్యాలీలో సోమవారం రాత్రి చైనా, భారత బలగాల మధ్య మళ్లీ ఘర్షణ చోటుచేసుకున్నది. అయితే ఆ ఘర్షణ హింసాత్మకంగా మారినట్లు భారతీయ ఆర్మీ ప్రకటించింది. భీకరంగా సాగిన ఆ కొట్లాటలో ఓ ఆర్మీ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు సైనికులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. వాస్తవానికి రెండు రోజుల నుంచి గాల్వన్ వ్యాలీలో రెండు దేశాల సైనికాధికారులు శాంతి చర్చలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు చర్చలు జరుగుతున్నా.. మరో వైపు రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగారు. అయితే ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేందుకు రెండు దేశాలకు చెందిన సీనియర్ సైనిక అధికారులు మళ్లీ సమావేశం అయ్యారు. లడఖ్ లోని పాన్‌గాంగ్ సో, గాల్‌ున్ వ్యాలీ, డెమ్‌చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రదేశాల్లో రెండు దేశాల సైనికులు కొన్నాళ్ల నుంచి ఎదురెదురుపడుతున్నారు. పాన్‌గాంగ్ సో ప్రాంతంలో చైనా ఆర్మీకి చెందిన దళాలు భారీ సంఖ్యలో తిష్ట వేశాయి. వాళ్లంతా వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించారు. కొన్ని వారాల క్రితం రెండు దేశాలకు చెందిన సైనికులు.. పాన్‌గాంగ్ సరస్సు సమీపంలో బాహాబాహీకి దిగారు. దీంతో చైనా, భారత సైనిక దళాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నది. భారత, చైనా సైనిక కమాండర్లు ఇప్పటికే గాల్వన్ వ్యాలీలో చర్చలు నిర్వహిస్తున్నారు. బ్రిగేడ్ కమాండర్, బటాలియన్ కమాండర్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. గాల్వన్ వ్యాలీ, పీపీ-15, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి ఇప్పటికే చైనా తమ బలగాలను ఉపసంహరించింది. ఇదే ప్రాంతం నుంచి దళాలను, ఆయుధాలను కూడా భారత్ వెనక్కి రప్పించింది. లడఖ్‌లో జరిగిన ఘర్షణలో.. ఇరు వైపులా నష్టం జరిగినట్లు తాజాగా భారత్ పేర్కొన్నది. తొలుత చేసిన ప్రకటనను.. భారత ఆర్మీ మళ్లీ సవరించింది. భారత్ బోర్డర్ దాటిందని మరో వైపు చైనా అధికారులు ఆరోపిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. కాసేపటి క్రితం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు త్రివిధదళాలకు చెందిన చీఫ్‌లు, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశం అయ్యారు. ఈస్ట్రన్ లడఖ్‌లో జరుగుతున్న పరిణామాలపై వారు చర్చించారు. మిలిటరీ స్థాయిలో సమస్య పరిష్కారం కాకుంటే.. దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది