ఆరుగంటల్లోనే దొంగను పట్టుకున్న పోలీసులు
కడప జూన్ 16
దొంగతనం చేసిన దొంగను ఆరు గంటల్లోనే కడపజిల్లా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు సీసీ కెమెరాలోని ఫుటేజీల ఆధారంగా ఈ కేసును ఛేదించారు. హైదరాబాదుకు చెందిన శంకర్‌రెడ్డి బంధువుల వివాహం కోసం కడపకు వచ్చారు. తన కారులో తిరిగి హైదరాబాదుకు బయలుదేరారు. బిల్టప్ సమీపంలో విజయదుర్గాదేవి ఆలయం వద్ద కారును ఆపారు. కారుకు ఓ తలుపు పడకపోవడంతో అలానే ఆలయంలోకి వెళ్లిపోయారు. ఇంతలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి కారులో ఉన్న బ్యాగును దొంగలించాడు. ఆ బ్యాగులో 18 తులాల బంగారు నగలు, 15 వేల నగదు ఉన్నాయి. వారు ఆలయంలో నుంచి బయటికి వచ్చి చూడగా కారులో బ్యాగు కనిపించలేదు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. డీఎస్పీ సూర్యనారాయణ తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. తాలూకా సీఐ నాగభూషణం ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్లూకోల్ట్స్ పోలీసుల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల్లోని ఫుటేజీలను పరిశీలించారు. దొంగ ద్విచక్ర వాహనంపై ఆలంఖాన్‌పల్లె వైపు.. అటు నుంచి టోల్‌గేట్ వైపు వెళ్లాడని గుర్తించారు. పోలీసులు ఆ ఫుటేజీల ఆధారంగా టోల్‌గేట్ దాటి ముందుకెళ్లి దొంగను పట్టుకుని నగలు, నగదు స్వాధీనపరచుకున్నారు.