కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది పాక్ ఆరోపణ
జెనీవా జూన్16
ప్రపంచ దేశాలు మూడు నెలలుగా కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నాయి. ప్రజలను కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సంక్షోభం బయటపెట్టిన వ్యవస్థల్లోని లోపాలను చక్కబెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. కానీ, మన దాయాది దేశం పాకిస్థాన్ మాత్రం 'కుక్క తోకర వంకర' అన్న చందంగానే వ్యవహరిస్తున్నది. ఎప్పటిలాగే భారత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నది. తాజాగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి లో మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి తన వక్రబుద్ధిని చాటుకున్నది. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ అర్థంలేని ఆరోపణలు చేసింది. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న మానవహక్కుల సంక్షోభాన్ని ప్రస్తావించి, దాని పరిష్కారాలపై చర్చించాల్సిన వేదికను రాజకీయం చేసేందుకు ప్రయత్నించింది. అయితే, పాకిస్థాన్ ఆరోపణలను భారత్ దీటుగానే తిప్పికొట్టింది. పాక్ వైఖరిని ఉదాహరణలతో సహా వివరిస్తూ ఎండగట్టింది. మండలి వేదికను దుర్వినియోగం చేయడమనే సంప్రదాయాన్ని పాకిస్థాన్ ఇప్పుడు కూడా కొనసాగించిందని ఐరాసలో భారత రాయబారి సెంథిల్ కుమార్ విమర్శించారు. దక్షిణాసియా దేశాల్లో నరమేధాన్ని ప్రోత్సహిస్తున్న ఏకైక దేశమైన పాకిస్థాన్.. మానవహక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు.సంకుచిత రాజకీయ అజెండా కోసం మండలి లాంటి అంతర్జాతీయ వేదికలను వాడుకోవడం ప్రమాదకరమని సెంథిల్ కుమార్ హెచ్చరించారు. కిడ్నాప్‌లు, మతమార్పిళ్లు, హత్యలు, ఉగ్రవాద క్యాంపులకు అడ్డాగా మారిన ఓ దేశం భారత్ లాంటి సహజ శాంతియుత దేశానికి నీతులు చెప్పడం సరికాదన్నారు. పాకిస్థాన్‌లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని తరచూ జరుగుతున్న దాడుల గురించి సెంథిల్ కుమార్ ప్రస్తావించారు.