YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఏపీలో కమల్ ఆకర్ష్...

 ఏపీలో కమల్ ఆకర్ష్...

 

 ఏపీలో కమల్ ఆకర్ష్...
విజయవాడ, జూన్ 17,
ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీల బలహీనతలు తమ పార్టీకి వరంగా మారబోతున్నాయని బీజేపీ బలంగా భావిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కమలం పార్టీ తన ఆపరేషన్ ను ప్రారంభించింది. గడచిన ఎన్నికల్లో రాష్ట్రంలో నామమాత్రావశిష్టంగా మిగిలిపోయిన పార్టీ పునరుత్తేజం పొందడానికి ప్రస్తుతం పరిస్థితులు సానుకూలమవుతున్నాయి. ఏడాదిగా తెలుగుదేశం, వైసీపీల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం భారీగానే జరిగింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలోని తప్పిదాలపై చర్యల విషయంలో నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను వైసీపీ రూపుదిద్దలేకపోయింది. దాంతో వైసీపీ సర్కారులోని లోపాలనే ఆసరాగా చేసుకుంటూ బీజేపీ ఉద్యమాలు చేపట్టింది. తెలుగుదేశమూ ఇందుకు జత కట్టింది. దీంతో రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ టీడీపీ, బీజేపీ మళ్లీ జట్టు కడతాయేమోనే భావన నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే గడచిన సంవత్సర కాలంగా ప్రతిపక్షాలకు ఒక అజెండాను బీజేపీ ఫిక్స్ చేసింది.వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ఆందోళనలు, నిరసనలు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపికి సానుకూలమవుతాయనే అంచనా ఏర్పడింది. అయితే ఒక అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి టీడీపీ పరోక్ష సహకారాన్ని సైతం కమలం పార్టీ తీసుకోగలిగింది. తాజాగా వైసీపీ సర్కారు తెలుగుదేశం నేతలపై టార్గెట్ ఫిక్స్ చేసుకోవడంతో బీజేపీ కి రాజకీయంగా కలిసి వస్తోంది. ఆర్థిక పరమైన కార్యకలాపాలు, వ్యాపారాలు ఉన్న టీడీపీ సీనియర్ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పార్టీకి పూర్తి విధేయత కనబరిచేవారిపై సర్కారు అవినీతి కేసుల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాజకీయ ఆశ్రయం కావాల్సిన నేతల సంఖ్య పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీని బదనాం చేసే క్రమంలో వైసీపీకి తాము కూడా మద్దతివ్వాలనేది బీజేపీ యోచన. అందువల్ల ప్రధాన ప్రతిపక్షం పూర్తిగా బలహీన పడుతుంది. ఆ పార్టీ క్యాడర్ , నాయకులు బీజేపీలో చేరే అవకాశాలు పెరుగుతాయి. మరోవైపు ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణమైన టీడీపీపై ప్రతీకారం తీసుకున్నట్లవుతుంది. ఈ కారణంగానే వైసీపీ, టీడీపీ వైరం బీజేపీకి వరంగా మారేందుకు చాన్సులు పెరుగుతున్నాయి.గతంలో బీజేపీకి క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏడాది కాలంగా వైసీపీకి మద్దతుగా మాట్లాడే బీజేపీ నాయకులు ఒక వర్గంగా, టీడీపీకి సానుకూలంగా మాట్లాడే బీజేపీ నాయకులు మరోవర్గంగా చీలిపోయారు. దీంతో బీజేపీ క్యాడర్ లోనే అయోమయం నెలకొంది. వ్యూహాత్మకంగానే ఈరకమైన వైఖరిని బీజేపీ అధిష్ఠానం అనుమతించింది. క్రమశిక్షణ కట్టుతప్పినా సహించింది. ఈ వైఖరి కారణంగా రెండు పార్టీలు బీజేపీని పరస్పరం మిత్రపక్షంగా భావించాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీ అగ్రనాయకత్వానికి స్పష్టత వచ్చింది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ స్థానాన్ని రాజకీయంగా అందిపుచ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. గతప్రభుత్వ తప్పిదాల పేరిట టీడీపీ నేతలపై ప్రస్తుత ప్రభుత్వం తీసుకునే చర్యలకు గట్టిగా మద్దతిస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కారు పాలనపరమైన లోపాలు, అవినీతిపై ఉద్యమాలు చేసేందుకూ సిద్ధమవుతోంది. ఇదొక ద్విముఖ వ్యూహం. ఇందులో భాగంగానే తాజాగా టీడీపీని సపోర్టు చేసిన నాయకులపై క్రమశిక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇకపై పార్టీలో అంతర్గతంగా డ్యూయల్ స్టాండ్ ఉండదని స్పష్టం చేసింది. రెండు ప్రధానపార్టీలతో పోరాటానికి తగినంత నైతిక, అంగబలం బీజేపీకి లభించినట్లేనని పార్టీ పెద్దలు అనుకుంటున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పార్టీలో చేరతారని ఆశిస్తున్నారు. వైసీపీ సర్కారు టీడీపీపై ఎంత కఠినంగా వ్యవహరిస్తే భారతీయ జనతాపార్టీకి రాష్ట్రంలో అంతగానూ మేలు చేకూరే పరిస్థితులు నెలకొన్నాయి.తెలుగుదేశం విషయంలో బీజేపీ కొంచెం కఠినమైన వైఖరినే తీసుకుంది. అలాగని వైసీపీని వదిలేది లేదంటున్నారు నాయకులు. అధికారపార్టీలో అసంత్రుప్తిగా ఉన్నవారికి గాలం వేస్తోంది కమలం పార్టీ. ప్రభుత్వ విధానాలు నచ్చక ఎంతగా నలిగిపోతున్నా ప్రధానప్రతిపక్షమైన టీడీపీని ఆశ్రయించే పరిస్థితి రాష్ట్రంలో లేదు. దీనిని బీజేపీ సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. గత ప్రభుత్వంలో తప్పిదాలు చేసినప్పటికీ బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల జోలికి సర్కారు వెళ్లడం లేదు. దీనికి అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతలను టార్గెట్ చేస్తే వైసీపీ నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. ఆదాయపన్నుశాఖ మొదలు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వరకూ కేంద్రం పరిధిలో పనిచేస్తున్న పటిష్టమైన వ్యవస్థలున్నాయి. అందువల్ల బీజేపీ నేతల జోలికి వైసీపీ సర్కారు వెళ్లదు. అవసరమైతే వైసీపీ నాయకుల జోలికి వచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ సిద్ధంగానే ఉంది. ఇదొక విచిత్రమైన పరిస్థితి. వైసీపీకి వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులను బీజేపీ ప్రోత్సహిస్తోందనే వాదన వినవస్తోంది. నరసాపురం ఎంపీ రఘురామక్రుష్ణంరాజు వంటి నాయకులు ఇప్పటికే కమలం పార్టీ తో పూర్తి స్థాయి సంబంధాలు నెలకొల్పుకున్నారు. దీంతో ఆపరేషన్ కమల్ మొదలైనట్లే నంటున్నారు. భవిష్యత్తులో ప్రజాప్రతినిధులు, నాయకులకు సంబంధించి పెద్ద ఎత్తున చేరికలుంటాయనేది అంచనా.

Related Posts