దేనికైనా సిద్ధం కండి.. హైఅలర్ట్‌లో త్రివిధదళాలు
న్యూ ఢిల్లీ జూన్ 17
చైనాతో సరిహద్దు విషయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో.. త్రివిధ దళాలను అప్రమత్తం చేశారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలు మొత్తం.. హై అలర్ట్‌లో ఉన్నాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని.. త్రివిధ దళాలకు సంకేతాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గాల్వన్ లో జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాల్వన్ లో వ్యాలీలో జరిగిన గొడవలో భారత సైన్యానికి చెందిన 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోశ్ బాబు కూడా వీరమరణం పొందారు. గాల్వాన్‌లో ఉన్న స్థానిక కమాండర్ స్థాయి అధికారికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎక్కడైనా శత్రువు ఉల్లంఘనకు పాల్పడితే, అక్కడ బలమైన ప్రతిఘన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భారత, చైనా సరిహద్దుల్లో పనిచేస్తున్న ఐటీబీపీ దళాలు కూడా ఇక నుంచి ఆర్మీ ఆధీనంలో ఉంటాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ప్రస్తుతానికి సైనిక అధికారుల చర్చలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.