లడఖ్ ఘర్షణలో 35 మంది చైనా సైనికులు మృతి : అమెరికా ఇంటెలిజెన్స్
న్యూ ఢిల్లీ జూన్ 17
లడఖ్ లోని గాల్వన్ లోయలో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో.. 35 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు మృతిచెందినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. దాంట్లో ఓ సీనియర్ అధికారి కూడా ఉన్నట్లు యూఎస్ వెల్లడించింది. గాల్వన్ వ్యాలీలోని పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద .. రెండు దేశాలకు చెందిన సైనికులు బాహాబాహీకి దిగారు. ఆ ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు కూడా మృతిచెందారు. తెలంగాణకు చెందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోశ్‌బాబు కూడా వీరమరణం పొందారు. అయితే తమకు జరిగిన ప్రాణ నష్టం గురించి మాత్రం చైనా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈస్ట్రన్ లడఖ్‌లోని పాంగ్‌గాంగ్ సో, గాల్వన్ వ్యాలీ, డెమ్‌చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. భారత సైనికుల్లో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నది.