పరీక్షల రద్దును పరిశీలించాలి : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ జూన్ 17
పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణను రద్దు చేసే అంశాన్ని పరిశీలించి, ఇంటర్నల్స్ ద్వారా మార్కులు కేటాయించాలని భారత అత్యున్నత న్యాయస్థానం బుధవారం సీబీఎస్ఈకి సూచించింది. దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుండడంతో పరీక్షలు రద్దు చేయాలని అమిత్ బాత్లా అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా వేసిన పది, ఇంటర్ పరీక్షలను జులై 1 నుంచి జూలై 15 వరకు పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ కసరత్తు చేస్తున్నది. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు రాయాల్సి వస్తే వారికి వైరస్ సోకే అవకాశం ఉందని, లక్షలాది మంది విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు సీబీఎస్‌ఈకి ఈ సూచనలు చేసింది.