నిర్మాణ రంగంపై ఉక్కు పిడుగు పడింది. పెరుగుతున్న ధరలతో నిర్మాణదారుల్లో ఆందోళన మొదలైంది. స్టీల్ కోసం నిర్మాణ దారులు వ్యాపారులకు ముందస్తు డబ్బులు ఇస్తే తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఎప్పుడు ధర పెరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని వారు పేర్కొంటున్నారు.ఇన్నాళ్లు ఊసురుమన్న నిర్మాణ రంగం ఎట్టకేలకు పుంజుకుంటున్న సమయంలో ఉక్కు ధరలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ధరలు బాగా పెరగటంతో నిర్మాణదారులను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ‘ఉక్కు’ పిడుగు పడుతోంది. స్టీలు ధరల పెరుగుదలతో సర్కారుపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుత అంచనా ప్రకారం నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టుల్లో ఉపయోగించే ఉక్కుకు సంబంధించి ప్రభుత్వంపై అదనంగా సుమారు రూ.900 కోట్ల భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ఉక్కు ధరలు ఇలాగే పెరిగితే... భవిష్యత్తులో ప్రాజెక్టులపై మరింత భారం పడనుందని భావిస్తున్నారు. ప్రాజెక్టులను మొదలు పెట్టినప్పుడు మార్కెట్‌లో ఉక్కు ధర టన్నుకు సుమారు రూ.34 వేల వరకు ఉండేది. అయితే ఎనిమిది మాసాలుగా ఉక్కు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కంపెనీని బట్టి ఉక్కు ధర టన్నుకు రూ.52 వేల వరకు ఉంది. దీంతో పెరిగిన ధరలను చెల్లించి ప్రాజెక్టుల నిర్మాణాల కోసం ఉక్కును కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందిమార్చి చివరి నాటికి టన్ను ధర సాధారణ కంపెనీల ఉక్కు రూ. 53వేలు, బ్రాండెడ్ కంపెనీల ఉక్కు రూ. 60 వేలకు చేరిందనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. అయితే జనవరిలో బ్రాండెడ్ కంపెనీ ఉక్కు క్విం టాలు ధర రూ. 3750, సాధారణ కంపెనీల ఉక్కు రూ. 3500 వరకు ఉండేది. ప్రస్తుతం బ్రాండెడ్ కంపెనీల ఉక్కు ధర రూ. 6000, సాధారణ కంపెనీల ఉక్కు ధర స్థాయిని బట్టి రూ. 4850 నుండి రూ. 5300 వరకు పెరిగింది. ఒక్కో క్వింటాలు మీద సుమారు రూ. 1000కి పైగా టన్నుకు రూ. 10 వేలకు పైగా పెరగటంతో ఇప్పుడిప్పుడే నిర్మాణాలు మొదలు పెడుతున్న వారికి అదనపు భారం మోయాల్సిన పరిస్థితి వచ్చిందనే వ్యాఖ్య లు వ్యక్తం అవుతున్నాయి. ఇదేక్రమంలో ఇప్పటికే నిర్మాణాలు సగం వరకు పూర్తి చేసుకున్న వారు పనులు ఆపలేక ఎక్కువ ధరకైనా ఉక్కు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.