వ్యవసాయంలో ఉండే శ్రమను తగ్గించడానికి అవసరమయ్యే వనరులను ప్రభుత్వం అందించాలి. . ఏ పంట సాగుచేసినా ధరలు ఉండడం లేదు. అరకొర ధరలు ఉంటే వాటిని సరైన ధరకు అమ్ముకోలేని దీనస్థితిలో ఉన్నారు. ఒకవైపు, దళారులు, మరో వైపు వ్యాపారులు తక్కువ ధరకు రైతు దగ్గర కొనుగోలు చేసి అధిక ధరకు అమ్ముకుంటూ రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయం చేసే వారుండరనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.అలాగే యువత కూడా వ్యవసాయం మొరటు పని అది మనవల్ల కాదు అనే ధోరణి మానుకోవాలి. ఆ విధంగా యువత మనసులను ప్రభావితం చేయగలగాలి. వ్యవసాయానికి అనువైన నేల మన దగ్గర ఉన్నది. మన దగ్గరి నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి జరగాలి.ఎగుమతులు పెరిగితే ఆదాయం మరింత పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న యువతకు మన యువత ఆదర్శం కావాలి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే వారికంటే వ్యవసాయం చేసే వారి గౌరవం పెరగాలి.లక్షల రూపాయలు అప్పుచేసి పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు అరకొర దిగుబడులతో వెక్కిరిస్తుంటే గిట్టుబాటు కాని ధరలు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేసే సబ్సిడీ విత్తనాలు కూడా అమాంతం ధరలు పెంచి ట్రేడర్స్‌కు, గ్రోయర్స్‌కు మేలు చేస్తోంది. వెరసి రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కాని కారణంగా రైతులు క్రమంగా కూలీలుగా మారుతున్నారు.జిల్లాలో 51 మండలాలను తీసుకుంటే 13,05,864.2 ఎకరాల సాగు భూమి ఉండగా, ఇందులో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేసే భూమి 10,50,345 ఎకరాలు ఉంటోంది. ఈ సాగు భూమిని నమ్ముకుని పంటలు పండించే రైతులు 4,89,754 మంది ఉన్నారు. అయితే మూడు సంవత్సరాలుగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు వ్యవసాయ దిగుబడులను మరింతగా దిగజార్చాయి. వివిధ కారణాలతో చదువులు మాని దాదాపు 1.20 లక్షల మంది దాకా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కుటుంబాల్లోని యువత వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా గమనిస్తున్నారు.