రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సహకార బ్యాంకుల్లో సహకారం కరువైంది. ఇంకో విషయం ఏమంటే రైతులను ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. 2015-16 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ ఈ రుణాలపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోగా, రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాబ్ ద్వారా వడ్డీ రాయితీ ఇవ్వకపోవడంతో రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీతో సహా అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. చాలా మంది రైతులకు ఈ విషయం తెలియక సబ్సిడీ వస్తుందని రుణాలు చెల్లించకపోవడంతో అపరాధ వడ్డీతో కలిపి రుణభారం పెరుగుతూ పోతుంది. ఎస్సీ, ఎస్టీ రైతులు తీసుకున్న రుణంపై 30శాతం, బీసీలకు 25శాతం సబ్సిడీ వచ్చేది. ఈ సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా సహకార బ్యాంకులు, సహకార పరపతి సంఘాలకు అందజేసేది. ఈ రుణాలపై 12.8శాతం వడ్డీ చెల్లించాల్సి వుండగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 6శాతం వడ్డీ రాయితీ కల్పించేది. ఈ విధంగా సహకార బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతులు గతంలో ఈ రాయితీలను సద్వినియోగం చేసుకోవడంతో రుణాలు సకాలంలో చెల్లించేవారు. కాగా . ఈ మొత్తం చెల్లించలేకపోతే ఆస్తులను జప్తు చేసే అధికారం బ్యాంకులకు వుండడంతో రైతులు మనస్తాపానికి లోనై ఆత్మహత్యలకు సైతం పాల్పడే అవకాశాలు లేకపోలేదు. జిల్లాలో 24 సహకార కేంద్ర బ్యాంకులు, 90 సహకార పరపతి సంఘాలు వేలాది మంది రైతులకు కోట్లాది రూపాయల రుణాలు అందజేస్తున్నాయి. నందికొట్కూరు డివిజన్ పరిధిలో బ్రాహ్మణకొట్కూరు సొసైటీలో 500మంది రైతులకు రూ. 1.67 కోట్లు, బన్నూరు సొసైటీలో 425మంది రైతులకు రూ.2.33కోట్లు, నందికొట్కూరు సొసైటీలో 245మంది రైతులకు రూ. 1.67 కోట్లు, పీరుసాహేబ్‌పేట సొసైటీలో 480మంది రైతులకు రూ. 2.43కోట్లు, పగిడ్యాల సొసైటీలో 280మంది రైతులకు రూ. 66.75 లక్షల రుణాలు అందజేశారు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా సబ్సిడీతో పాటు వడ్డీ రాయితీ వస్తుందనే నమ్మకంతో రుణాలు తీసుకున్నామని, అయితే నేడు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ రాయితీలు రద్దు చేయడంతో తాము రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు ఈ ఏడాది తాము పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటలను అమ్ములేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది