నారాయణకు...దారులు బంద్
నెల్లూరు, జూన్ 18
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఒకవైపు పంజా విసురుతున్నా రాజకీయాలు కూడా అంతే జోరుగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు, కేసులకు నిరసనగా ఆందోళనలు, అసెంబ్లీ సమావేశాలు, నేతల వలసలు, ఇలా రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బతీసే క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలను చేర్చుకుంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి పేరు ఈ చేరికల లిస్టులో ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయనను పార్టీలో చేర్చుకుంటే వైసీపీ ఇరుకున పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.151 అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు మీద ఉంది. ఇదే జోరులో తెలుగుదేశం పార్టీని దెబ్బ మీద దెబ్బ కొట్టేందుకు వలసలను ప్రోత్సిహిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీకి జిందాబాద్ కొట్టేశారు. పలువురు మాజీ మంత్రులు, నేతలు వైసీపీలో చేరిపోయారు. తాజాగా, మాజీ మంత్రి నారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. త్వరలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమని చెబుతున్నారు.అయితే, ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడం ద్వారా చేర్చుకున్న పార్టీకి కలిసివస్తుంది. కానీ, నారాయణ విషయంలో వైసీపీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. నారాయణను చేర్చుకుంటే వైసీపీ చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. నారాయణ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులు. చాలా ఏళ్లుగా టీడీపీకి అనేక విషయాల్లో అండగా ఉంటూ వస్తున్నారు. అందుకే అధికారంలోకి రాగానే ఎవరి ఊహలకు అందని విధంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. కీలకమైన శాఖలను కట్టబెట్టారు.మంత్రిగా ఉన్నప్పుడు నారాయణపైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా రాజధాని భూకుంభకోణంలో నారాయణదే ప్రధాన పాత్ర అని ఆరోపించింది. నారాయణ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, ఎకరాల కొద్ది భూమిని అమరావతిలో పోగు చేసుకున్నారని వైసీపీ ఆరోపించింది. ఆ పార్టీ అనుకూల మీడియా ఈ విషయంపై సీరియల్ కథనాలు సైతం ప్రచురించింది. ఇప్పుడు కూడా అమరావతిలో భూకుంభకోణం జరిగిందనే వైసీపీ వాదిస్తోంది. దీనిపై విచారణ జరిపిస్తోంది. ఇటువంటి సమయంలో ఈ విషయంలో ఎక్కువ ఆరోపణలు ఎదుర్కుంటున్న నారాయణను పార్టీలో చేర్చుకుంటే వైసీపీ ఇన్ని రోజులుగా చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నీరుగారిపోతాయి.మరోవైపు నారాయణది కార్పొరేట్ విద్యా మాఫియా అని, ఆయన పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో ఆయనపై, ఆయన ఉన్న టీడీపీపై వైసీపీ ఎన్నో ఆరోపణలు చేసింది. ఇప్పుడు నారాయణను పార్టీలో చేర్చుకుంటే ఈ విషయంలోనూ వైసీపీ ఇరుకునపడే అవకాశం ఉంది.ముఖ్యంగా, తమ ప్రభుత్వం కార్పొరేట్ విద్యామాఫియాకు వ్యతిరేకం అని వైసీపీ చెబుతోంది. ఏడాదిగా వైసీపీ తీసుకుంటున్న చాలా చర్యలు కూడా కార్పొరేట్ విద్యా మాఫియా పీచమణిచేలా ఉన్నాయి. ఇటువంటి సమయంలో నారాయణను పార్టీలో చేర్చుకుంటే విమర్శలు ఎదుర్కునే అవకాశం ఉంటుంది.గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నారాయణ పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారో లేరో ఆ పార్టీకే అర్థం కాని పరిస్థితి ఉంది. నారాయణ కూడా స్వయంగా గత ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నెల్లూరుకు కూడా ఆయన ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు.అయితే, ఆర్థికంగా మాత్రం ఆయన బలమైన వ్యక్తి. మరి, ప్రచారం జరుగుతున్నట్లుగా నారాయణ నిజంగానే వైసీపీలో చేరతారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ ఆయనను పార్టీలో చేర్చుకుంటే ఎదురయ్యే విమర్శలను వైసీపీ ఎలా ఎదుర్కుంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది.