సేఫ్ జోన్ లోకి ఈటెల
హైద్రాబాద్, జూన్ 18,
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ పదవిని విపక్షాలు, మీడియానే కాపాడుతున్నట్లున్నాయి. గతంలోనూ ఈటల రాజేందర్ పదవి పోతుందని మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈటల రాజేందర్ కు అసలు మంత్రి పదవి దక్కడం కూడా కష్టమని వార్తలు వచ్చాయి. అయితే రెండో దఫా విస్తరణలో ఈటల రాజేందర్ కు మంత్రి పదవి దక్కింది. గతంలో ఆర్థిక శాఖమంత్రిగా పనిచేసిన ఈట రాజేందర్ ను రెండోసారి మాత్రం వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా నియమించారు.వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవి అంటే ఆషామాషీకాదు. కీలకమైన పోర్టిఫోలియో. దీంతో ఈటల రాజేందర్ కు కేసీఆర్ వద్ద ఏమాత్రం పలుకుబడి తగ్గలేదని మంత్రి పదవి చేపట్టి ఈటల రాజేందర్ నిరూపించారు. అయితే ఆ తర్వాత వరసగా ఆయన చేసిన వ్యాఖ్యలతో ఈటలకు, కేసీఆర్ కు మధ్య దూరం పెరిగిందన్న టాక్ నడిచింది. ఎన్నికల తర్వాత ఆయన కొంత హర్ట్ అయినట్లు కన్పించారు.తెలంగాణ ఉద్యమంలోనూ, టీఆర్ఎస్ జెండా మోయడంలోనూ తన భాగస్వామ్యం తీసి వేయలేదని ఈటల రాజేందర్ ఖారఖండీగా చెప్పేశారు. కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ కు మంత్రి పదవి ఇవ్వడం తనకు చెక్ పెట్టడానికేనని ఈటల రాజేందర్ భావిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఈటల రాజేందర్ ఖండిస్తూనే ఉన్నారు. అయినా ప్రతి సారీ ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సయితం ఈటల రాజేందర్ ను త్వరలోనే మంత్రి వర్గం నుంచి తప్పిస్తారని వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటం, గాంధీ ఆసుపత్రి తరచూ వివాదాలకు ఎక్కుతుండటంతో దీనికి ఈటల రాజేందర్ ను కేసీఆర్ భాధ్యుడిగా చేస్తారంటున్నారు. గతంలోనూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన రాజయ్య లాగానే తప్పిస్తారంటున్నారు. రేవంత్ రాజకీయం కోసమే ఈటల రాజేందర్ పై ఈ వ్యాఖ్యలు చేసినా, ఇప్పుడు నిజంగా మంత్రి వర్గం నుంచి తప్పించాలనుకుంటున్న కేసీఆర్ మాత్రం ఇక పని చేయరంటున్నారు. సో.. ఈటల రాజేందర్ పదవి ఇప్పట్లో ఊడదన్నది గులాబీ పార్టీల నుంచి విన్పిస్తున్న మాట