హనుమంతుడు సీతమ్మని చూస్తుండగా మెల్లగా తెల్లవారింది.
తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తములో ఆ లంకా పట్టణములో బ్రహ్మరాక్షసులు(యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో వారు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసులుగా పుడతారు) వేద మంత్రాలను పఠింస్తుండగా మంగళవాయిద్యాలు వినపడుతుండగా రావణుడు నిద్రలేస్తూ జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు. సీతమ్మ గుర్తుకు వచ్చి విశేషమైన కామం కలిగింది. వెంటనే ఉత్తమమైన ఆభరణములని ధరించి స్నానం కూడా చెయ్యకుండా అశోకవనానికి బయలుదేరాడు. రాత్రి రావణుడితో క్రీడించిన కాంతలు కూడా ఆయన వెనకాల బయలుదేరారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసం బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకొని వెళ్ళింది. ఇంకొక స్త్రీ రావణుడు ఉమ్మి వెయ్యడం కోసమని ఒక పాత్ర పట్టుకొని వెళ్ళింది. కొంతమంది ఆయనకి గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొంతమంది మంగళవాయిద్యాలు మ్రోగిస్తూ వస్తున్నారు. కొంతమంది రాక్షసులు కత్తులు పట్టుకొని వచ్చారు. ఇంతమంది పరివారంతో కలిసి దీనురాలైన ఒక స్త్రీ పట్ల తన కామాన్ని అభివ్యక్తం చెయ్యడానికి తెల్లవారుజామున బయలుదేరాడు. అప్పటివరకూ శింశుపా వృక్షం కింద కూర్చుని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడము గమనించి శరీరాన్ని ముడుచుకొని కూర్చున్నది. అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన పూజలా, అపవాదాన్ని భరిస్తున్నదానిలా, శ్రద్ధ నశించిపోయినదానిలా, యజ్ఞ వేదిలో చల్లారిపోతున్న దానిలా ఉన్నది. అలా ఉన్న సీతమ్మ దగ్గరికి తెల్లటి పాలనురుగులాంటి వస్త్రము ధరించి రావణుడు వచ్చాడు. అప్పుడాయన తేజస్సుని చూడలేక హనుమంతుడు కొంచెం వెనక కొమ్మలలోకి వెళ్ళి ఆకులని అడ్డు పెట్టుకొని చూశాడు. రావణుడు సీతమ్మతో " పిరికిదానా ! నీకు ఎందుకు భయం? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడున్న వాళ్ళందరూ నేను రాక్షసులమే. ఈ నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నేను అన్ని లోకములను ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ లేడు. ఇక్కడ తప్పు చెయ్యడానికి భయపడతావు ఎందుకు? ఎవరన్నా ఉత్తమమైన స్త్రీలు కనపడితే వాళ్ళని తీసుకొచ్చి తమదిగా అనుభవించడము రాక్షసుల ధర్మం. నేను నా ధర్మాన్ని పాటించాను. ఏదో నేను తప్పు చేసినట్టు చుస్తావేమిటి? మనిషికి శరీరంలో యవ్వనము అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది. నువ్వు ఇలాగే చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనము వెళ్ళిపోతుంది. అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను.నేను నిన్ను పొందాలి అని అనుకుంటే అది నాకు క్షణంలో పని. నేను నిన్ను బలవంతముగా పొందను. నీ అంతట నువ్వు నా పాన్పు చేరాలి.ఎందుకు ఇలా ఒంటిజెడ వేసుకొని, మలినమైన బట్ట కట్టుకొని, భూమి మీద పొడుకుని ఉపవాసాలు చేస్తూ ఉంటావు. నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో, ఆభరణములు ఉన్నాయో, వస్త్రములు ఉన్నాయో చూడు. ఏడువేల మంది ఉత్తమకాంతలు నీకు దాసీ జనముగా వస్తారు. ఆ రాముడు దీనుడు. అడవులు పట్టి తిరుగుతున్నాడు. అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. దేవతలు కూడా నన్ను ఏమి చెయ్యలేరు. అలాంటిది ఒక నరుడు ఈ నూరు యోజనముల సముద్రాన్ని దాటి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు హాయిగా త్రాగు, తిరుగు, కావలసినది అనుభవించు. ఆభరణాలు పెట్టుకుని నాతో రమించు. నాకున్న ఐశ్వర్యము అంతా నీ ఐశ్వర్యమే. నీ బంధువులని పిలిచి ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళకి ఇవ్వు " అన్నాడు.రావణుడి మాటలను విన్న సీతమ్మ శుద్ధమైన నవ్వు నవ్వి ఒక గడ్డిపరకని తనకి రావణుడికి మధ్యలో పెట్టి " రావణా! నీ మనస్సు నీవారి యందు పెట్టుకో. నీకు అనేకమంది భార్యలు ఉన్నారు. వాళ్ళతో సుఖంగా ఉండు. పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటే ఎలాగన్నా బ్రతకవచ్చు. కాని చనిపోవడము నీ చేతులలో లేదు. నువ్వు సుఖముగా బ్రతకాలన్నా చనిపోవాలన్న నీకు రామానుగ్రహము కావాలి. ఒంట్లో ఓపిక ఉన్నదని పాపం చేస్తున్నావు. ఆ పాపాన్ని అనుభవించవలసిననాడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషముగా జీవించు. శరణు అన్నవాడిని రాముడు ఏమి చెయ్యడు. ' నేను సీతని తీసుకొచ్చాను ' అంటావేమిటి? నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుంచి సుర్యుడికాంతిని వేరు చేసి తేగలవా ! వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా! పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా! ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుండి నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో ఇదంతా నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక. ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు. ఇక నీ పాపం పోదు. దీనికి ఒకటే మార్గం నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు బ్రతికిపోతావు. నేను నిన్ను ఇప్పుడే నా తపఃశ్శక్తి చేత బూడిద చెయ్యగలను. నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణము చేత ఆగిపోయాను. అసలు ఇక్కడ ధర్మం అనేది చెప్పేవారు లేరా? ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా? " అని ప్రశ్నించింది
ఈ మాటలు విన్న రావణుడికి ఆగ్రహము వచ్చి " ఏ స్త్రీయందు విశేషమైన కామం ఉంటుందో ఆ స్త్రీయందు ఉపేక్షించే స్వభావము కూడా ఉంటుంది. నన్ను చూసి ఇంతమంది స్త్రీలు కామించి వెంటపడ్డారు. నీకు ఐశ్వర్యము ఇస్తాను, సింహాసనం మీద కుర్చోపెడతాను, నా పాన్పు చేరు అంటే ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు. నీకు నా గొప్పతనం ఏమిటో తెలియడము లేదు " అని అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి " ఈమెయందు సామమును, దానమును, బేధమును ప్రయోగించండి అని నేకు మీకు చెప్పాను. ఈమె లొంగలేదు పది నెలల సమయము అయిపోయింది. ఇంకా 2 నెలల సమయము మాత్రమే ఉన్నది. ఆ సమయములో సీత నా పాన్పు తనంతట తాను చేరితే సరి లేకపోతే మీరు సీతని దండించండి " అన్నాడు. ( ఇంట్లో తనని ప్రేమించి, అనుగమించే భార్య ఉన్నా ఆ భార్యయందు మనస్సు ఉంచకుండా పరస్త్రీయందు మనస్సు ఉంచుకొని పరస్త్రితో సంగమించిన పురుషుడికి ఆ దోషం పోవాలంటే ఆరు నెలలపాటు తిరిగిన వీధి తిరగకుండా, మిట్టమధ్యానం వేళ, చీకటి పడ్డాక, పాత్ర పట్టుకొని ఇళ్ళ ముందుకి వెళ్ళి నాయందు మనస్సున్న ఆరోగ్యవంతురాలైన భార్య ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో సంగమించిన మహాపాతకుడిని. నేను ఆ పాప విముక్తుడిని అవ్వాలి. అందుకని మీ చేతితో ఇంత అన్నం తీసుకొచ్చి పడెయ్యండమ్మా ' అని ముష్టి ఎత్తుకున్న అన్నం తింటే వాడి పాపం పోతుంది. ఇది పురుషులకి వర్తిస్తుంది, స్త్రీలకి వర్తిస్తుంది.) రావణుడి భార్య అయిన ధాన్యమాలిని రావణుడిని నీయందు మనస్సున్న స్త్రీతో భోగిస్తే అది ఆనందము. నీయందు మనస్సులేని స్త్రీతో ఎందుకు ఈ భోగము?పద " అనేసరికి ఆ రావణుడు నవ్వుకుంటూ తన భార్యలతో వెనక్కి వెళ్ళిపోయాడు.
శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమేసహస్ర నామ తతుల్యం శ్రీ రామ నామ వరాననే
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో